హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై కొద్ది రోజులుగా రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ బయో డైవర్సిటీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అక్కడ వన్య ప్రాణులు చనిపోతున్నా రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే, అది ప్రభుత్వ భూమి అని కాంగ్రెస్ చెబుతోంది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ తొలిసారి స్పందించారు. హర్యానాలోని ఓ సభలో మాట్లాడిన మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
అడవులపై బుల్డోజర్లు పంపడంలో తెలంగాణ ప్రభుత్వం నిమగ్నమై ఉందని మోదీ విమర్శించారు. ప్రకృతి విధ్వంసం, వన్యప్రాణులకు హాని కలిగించడం కాంగ్రెస్ పాలనలో సాధారణమని ఫైర్ అయ్యారు. అటవీ సంపదను తెలంగాణ సర్కార్ నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ విస్మరించిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు మోసపోతున్నారని ఆరోపించారు. హర్యానాలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ యూనిట్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభలో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.