టీడీపీ వర్మ..ఉరఫ్ పిఠాపురం వర్మ ఇక ఖుషీయేనా? ఆయన ఆవేశం-ఆక్రోశం అన్నీ తగ్గాయా? అంటే.. కొంత వరకు ఫర్లేదన్న సంకేతాలు వస్తున్నాయి. తాజాగా శనివారం విజయవాడలో నిర్వహించిన మాజీ మంత్రిదేవినేని ఉమా కుమారుడి నిశ్చితార్థ వేడుకలకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికే వర్మ కూడా వచ్చారు. వాస్తవానికి ఆయన వస్తారని ఎవరూ అనుకోలేదు. కానీ..దేవినేని పిలిచినందుకు కాదు..చంద్రబాబు వస్తున్నందుకు అన్నట్టుగా వర్మ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాను 2024 ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన తర్వాత.. చంద్రబాబు అప్పాయింట్మెంటు కోసం వర్మ ప్రయత్నించారు. తనకు ఇచ్చిన హామీలను అడగడంతోపాటు.. పిఠాపురంలో జనసేన దూకుడు, ముఖ్యంగా ఆ పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగ బాబు వ్యవహారాన్ని చర్చించాలని అనుకున్నట్టు కొన్ని రోజుల కిందట చర్చ జరిగింది. కానీ.. వేడిగా ఉన్నప్పుడు.. చర్చలు చేపడితే.. అవి వితండవాదానికి దారి తీసి.. వికృత సమస్యలు పుట్టుకువస్తాయని భావించిన చంద్రబాబు కాదన్నారు. ఈ క్రమంలోనే తాజాగా దేవినేని కుమారుడి ఫంక్షన్లో కలుసుకున్నారు.
చంద్రబాబునువర్మ.. వర్మను చంద్రబాబు పరస్పరం చూసుకున్నారు. ఇద్దరూ షేక్ హ్యాండ్స్ కూడా ఇచ్చుకున్నారు. అనంతరం.. ప్రత్యేకంగా 5 నిమిషాలు మాట్లాడుకున్నారు. అయితే..వారు ఏం చర్చించుకున్నారన్నది తెలియకపోయినా.. భావములోన భాగ్యమునందున అన్నట్టుగా.. వర్మ ముఖంలో చిరునవ్వులు చూసిన తర్వాత.. ఏదో ఖుషీ అయిందన్న చర్చ అయితే.. పార్టీ నాయకుల మధ్య చోటు చేసుకుంది. గత ఎన్నికల్లో టికెట్ లేకపోవడం.. ఎమ్మెల్సీగా ఇప్పటికీ అవకాశం ఇవ్వకపోవడంతో వర్మ నిజంగానే ఆవేదనతో ఉన్నారు.
ఈ క్రమంలో తాజాగా బలమైన హామీనే చంద్రబాబు ఇచ్చారన్న చర్చ సాగుతోంది. అది ఏంటనేది మాత్రం ఆ ఇద్దరికే తెలుసు. ఇంతకు మించి.. ఎవరికీ ఏమీ తెలియకపోవడం గమనార్హం. అయితే.. ఏదేమైనా.. ఇప్పటి వరకు ఉన్న వివాదాల పరిస్థితి ఎలా ఉన్నా.. వ్యక్తిగతంగా కొంత వరకు వర్మకు ఊరట లభించినట్టు అయిందని.. విజయవాడకు చెందిన సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. దీంతో పిఠాపురంలో కొన్నాళ్లుగా రేగుతున్న అసంతృప్తి, ఆగ్రహాలకు చంద్రబాబు చెక్ పెట్టినట్టేనని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.