కేసుల మీద కేసులున్నప్పటికీ ఇప్పటివరకు అరెస్టు అన్నది తెలియని మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి గురించి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల వేళ పోలింగ్ బూత్ లోకి చొరబడి.. ఈవీఎంలను బద్ధలు కొట్టిన ఆయన.. ఆ కేసులో తాజాగా అరెస్టు కావటం తెలిసిందే. ఈవీఎంలను ధ్వంసం చేసిన వీడియో వైరల్ గా మారినప్పటికీ.. కోర్టు ఆదేశాలతో అరెస్టు ప్రమాదం నుంచి తాత్కాలికంగా తప్పించుకున్నా.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు ఆ తర్వాతి విచారణల అనంతరం ఆయన్ను అరెస్టు చేసేందుకు అనుమతులు ఇవ్వటం తెలిసిందే. అదే సమయంలో పాత కేసులు కూడా ఆయన అరెస్టుకు కారణమయ్యాయి.
పిన్నెల్లి సుదీర్ఘ రాజకీయ జీవితంలో బోలెడన్ని వివాదాలున్నప్పటికీ.. ఆయనకు ఎప్పుడూ ఎదురుదెబ్బ తగిలింది లేదు. ఎన్నికల వేళ ఈవీఎంల ధ్వంసంలో మాత్రం కెమేరా కంటికి చిక్కి అడ్డంగా బుక్ అయ్యారు. చట్టం నుంచి తప్పించుకోలేని పరిస్థితి. పోలీసుల అదుపులో ఉన్న పిన్నెల్లిని కోర్టుకు తీసుకెళుతున్న వేళలోనూ తన దాదాగిరిని ఆపలేదు. ఆయన్ను కోర్టుకు తీసుకెళుతున్న వేళలో.. తెలుగు యువత జిల్లా కార్యదర్శి కొమెర శివ ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వబోయారు.
అందుకు నో చెప్పిన పిన్నెల్లి.. శివ కడుపులో బలంగా కొట్టారు. దీంతో బాధితుడికి తీవ్రమైన నొప్పికి గురయ్యాడు. ఈ అనుకోని పరిణామాన్ని ఊహించని పోలీసులు బాధితుడ్ని పక్కకు తీసుకెళ్లారు. ఇదే కాదు.. వైద్య పరీక్షల కోసం ఎస్పీ ఆఫీసు నుంచి జిల్లా ఆసుపత్రికి తీసుకెళుతున్న వేళలోనూ ఆ వ్యవహారాన్ని షూట్ చేస్తున్న స్థానిక కెమెరామన్ మీదా దాడికి ప్రయత్నించారు. తనపై దాడికి పాల్పడిన పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డిపై కొమెరశివ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. ఆయన మీద సెక్షన్ 303 కింద మరో కేసు నమోదు చేశారు మాచర్ల టౌన్ పోలీసులు.