రబీ ధాన్యం కొనుగోళ్లలో కుంభకోణం జరిగిందంటూ రాజ్య సభ సభ్యుడు, వైసీపీ నేత, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 17 వేల మంది రైతులు ఆధార్‌తో అనుసంధానం కాలేదని ఆయన ఆరోపించడం కలకలం రేపింది. రైస్ మిల్లుల యజమానులు, అధికారులు ఆధార్ లింక్ చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాదు, ఈ కుంభకోణానికి సంబంధించి తన దగ్గర ఆధారాలున్నాయని, వాటిని బీఆర్ అంబేడ్కర్ జిల్లా(కోనసీమ జిల్లా) కలెక్టర్‌కు అందజేస్తానని బోస్ చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల వ్యవహారాన్ని సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని అన్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు అధికారులు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై కలెక్టర్‌ను కలుస్తానని, దీనిపై సీఐడీ విచారణ కోరతానని తెలిపారు.
ఇక, రాజ్యసభ అభ్యర్థులు ఎంపికపైనా బోస్ స్పందించారు. సీఎం జగన్ బీసీల పక్షపాతి అని.. అందుకే నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండు పదవులను బీసీలకు ఇచ్చారని ఆయన అన్నారు. బడా పారిశ్రామిక వేత్తలకు ఇచ్చే పదవుల్ని సామాన్య బీసీలకు కట్టబెట్టడం ఆశ్చర్యం కలిగించిందని జగన్ ను ఆకాశానికెత్తేశారు. గత ప్రభుత్వాలు బడా పారిశ్రామిక వేత్తలకే రాజ్యసభ సభ పదవులు కట్టబెట్టారని విమర్శించారు.
మరోవైపు, బోస్ ఆరోపణలపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. కోనసీమలోనే కాదు నెల్లూరులో బస్తాకు రూ.300కు పైగా దోచేశారని సోమిరెడ్డి ఆరోపించారు. వైసీపీ నేతలు, దళారులు, మిల్లర్లు కుమ్మక్కై రైతుల పుట్టి ముంచేశారని ఆయన ఆరోపించారు. మూడేళ్ల జగన్ రెడ్డి పాలనలో ఒక్క నెల్లూరులోనే రూ.3 వేల కోట్లు దోచుకున్నారని షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ స్కామ్‌పై సీఐడీ విచారణ కాదని, సీబీఐ లేదా జ్యూడిషియల్ ఎంక్వయిరీ జరిపి నిజాలు నిగ్గుతేల్చాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.