ఏపీ సీఎం జగన్ సభలకు ప్రజలు ఇష్టపడి వస్తున్నారా? కష్టపడి వస్తున్నారా? అంటే.. రెండోదే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఇష్టపడి వస్తే.. ఎన్నికష్టాలు ఎదురైనా.. ప్రజనలు సభ అయ్యే వరకు ఉంటారు. కానీ, ముఖ్యమంత్రి పర్యటన అంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. అడుగడుగునా ఆంక్షలతో అల్లాడిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో తాజాగా జరిగిన సీఎం జగన్ పర్యటనలోనూ అదే పరిస్థితి కనిపించింది.
మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేసే రోడ్డులోని పెట్రోలు బంకు, దుకాణాలన్నింటినీ మూసివేయిం చారు. సభా ప్రాంగణంలో సామర్థ్యానికి మించి జనసమీకరణ చేశారు. 21 డ్వాక్రా గ్రూపుల నుంచి కనీసం 200 మంది తగ్గకుండా సభకు తీసుకురావాలని నిబంధన విధించారు. సభకు రాకపోతే పథకాలు, రుణాలు రావని చెప్పి మరీ మహిళలను తరలించారు. సభ వద్దకు వచ్చాక తన పరిధిలో హాజరైన మహిళలతో సభాప్రాంగణం సమీపంలో ఫొటో దిగి గ్రూపులో పెట్టాలని అధికారులు ఆదేశించారు.
దీంతో పథకాలకోసమైనా.. అన్నట్టుగా.. ఉదయం 9 గంటలకే పెద్ద ఎత్తున మహిళలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మహిళలకు ఆహారం, మంచినీటి ప్యాకెట్లను ఇచ్చారు. కానీ వాటిని లోపలికి అనుమతించ లేదు. షుగర్‌తో ఇబ్బంది పడుతున్నామని, సమయానికి ఏదో ఒకటి తినాలంటూ ప్యాకెట్లు తీసుకెళ్లే ప్రయత్నం చేసినా పోలీసులు ఒప్పుకోలేదు. ముఖ్యమంత్రి 11:20కి వేదిక వద్దకు చేరుకుని ప్రసంగం ప్రారంభించారు.
అయితే, ఎండల ధాటికి ఉక్కపోతతో మహిళలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఉండలేక కొందరు సీఎం ప్రసంగం మధ్యలోనే బారికేడ్లు దాటి మరీ వెనుదిరిగారు. సీఎం ప్రసంగిస్తున్న సమయంలో బెంతు ఒరియా కుల ధ్రువీకరణ పత్రాలు పునరుద్ధరించాలంటూ కొందరు ఫ్లెక్సీలను ప్రదర్శించారు. మరోవైపు మూలపేట వచ్చిన ముఖ్యమంత్రిని కలుద్దామని ప్రయత్నించిన గ్రామస్థులను పోలీసులు అడ్డుకున్నా రు. మూలపేట, విష్ణుచక్రం గ్రామస్థులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమవుతారని తొలుత ప్రకటించారు. చివరి క్షణంలో దాన్ని రద్దుచేశారు.