పవర్ స్టార్ పవన్ చాలా ఏళ్ల తర్వాత చేసిన స్ట్రెయిట్ మూవీ.. హరిహర వీరమల్లు. ఐతే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా బాగా ఆలస్యం అవుతోంది. షూట్ మొదలైన నాలుగేళ్లకు కూడా రిలీజ్ కాని పరిస్థితి. ఐతే ఎట్టకేలకు కొత్త ఏడాదిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. మార్చి 28కి డేట్ ఇచ్చారు.
ఇటీవలే ఈ సినిమా బ్యాలెన్స్ షూట్ కోసం పవన్ డేట్లు కేటాయించాడు. చిత్రీకరణ జరుగుతోంది. క్రిష్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాక బ్యాలెన్స్ షూట్ బాధ్యతను నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ తీసుకున్నాడు. త్వరలోనే షూట్ అంతా పూర్తయిపోతుందని భావిస్తున్నారు. ఈ సినిమా పక్కాగా మార్చి 28న రిలీజవుతుందని టీం వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే మార్చి 28కే షెడ్యూల్ అయిన విజయ్ దేవరకొండ సినిమా పరిస్థితి ఏంటన్నది ప్రశ్న.
ఐతే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రాన్ని వాయిదా వేయడానికి తమకు అభ్యంతరమేమీ లేదని అంటున్నాడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. పవన్ సినిమా కనుక మార్చి 28న రిలీజయ్యేట్లయితే విజయ్ మూవీని ఏప్రిల్ లేదా మేలో విడుదల చేయడానికి చూస్తామని అతను తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. పవన్ సినిమా రాకుంటే మాత్రం అనుకున్న ప్రకారమే మార్చి 28న తమ చిత్రాన్ని రిలజీ్ చేస్తామన్నాడు.
ఇదిలా ఉండగా గౌతమ్ దర్శకత్వంలోనే సితార సంస్థ ‘మ్యాజిక్’ అనే మరో సినిమాను నిర్మించింది. అందరూ కొత్త వాళ్లే నటించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఇందులో ఏడు పాటలు ఉంటాయని.. అందులో ఆరు రెడీ అయ్యాయని.. ఇంకో పాటను రికార్డ్ చేయాల్సి ఉందని వంశీ తెలిపాడు. ఆ పాట కూడా పూర్తయ్యాక ఒకప్పటి స్టయిల్లో అన్ని పాటలను ఒకేసారి లాంచ్ చేస్తామని వంశీ తెలిపాడు. ఆ తర్వాత హైదరాబాద్లో మ్యూజికల్ కన్సర్ట్ ఏర్పాటు చేస్తామని.. అందులో అనిరుధ్ ఈ పాటతో లైవ్ పెర్ఫామెన్స్ ఇస్తాడని నాగవంశీ తెలిపాడు.