ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ పై వైసీపీ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు..తాజాగా ఢిల్లీలో ఎన్డీఏ కూటమి భేటీకి హాజరైన పవన్ కళ్యాణ్ ఏపీకి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆ విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. వాలంటీర్లపై తగ్గేదేలే అన్న రీతిలో పవన్ తాజాగా మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు పవన్ ను విచారణ జరపాలంటూ ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చినా సరే పవన్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు.
తాజాగా వాలంటీర్లపై పవన్ విరుచుకుపడ్డారు. ప్రజల వ్యక్తిగత వివరాలు సేకరించడంపై వైసీపీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు. వాలంటీర్లకు అధినేత ఎవరు? ప్రజల ప్రైవేట్ డేటాను సేకరించేందుకు ఎవరు సూచనలు ఇస్తారు? అని పవన్ ప్రశ్నించారు. ఒకవేళ వాలంటీర్ల వ్యవస్థను ప్రైవేట్ కంపెనీ నిర్వహిస్తోంటే దానికి అధిపతి ఎవరు అని నిలదీశారు. ఒకవేళ ప్రభుత్వమే వాలంటీర్ల వ్యవస్థను నిర్వహిస్తుంటే డేటా సేకరించమని ఆదేశిస్తున్నది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లకు సీఎం, సీఎస్,కలెక్టర్, ఎమ్మెల్యే లలో ఎవరు ఆదేశాలిస్తున్నారని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని పీఎంవోపాటు కేంద్ర హోం మంత్రి కార్యాలయాన్ని కూడా పవన్ ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇక, వాలంటీర్ల వ్యవస్థపై జనసేన సోషల్ మీడియా టీం శతఘ్ని మరో ట్వీట్ చేసింది. ఏ ప్రభుత్వ శాఖకు చెందని వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని ట్వీట్ చేసింది. వాలంటీర్ అని చెప్పుకొని డేటా సేకరిస్తున్నా ఓ యువతీని కొందరు ప్రజలు ప్రశ్నించారుజ అయితే, వాలంటీరు ఐడి కార్డు చూపించడానికి బదులు తన కాలేజీ ఐడి కార్డు చూపించడంతో వారు ఆమెను నిలదీశారు. ఇదే తరహాలో వైసీపీపై ప్రజలు తిరుగుబాటు చేస్తారని శతఘ్ని చేసిన ట్వీట్ ను పవన్ రీట్వీట్ చేశారు.