పార్టీ అధినేతగా ఉండి.. ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవటానికైనా సిద్ధంగా ఉండే వారు కొద్దిమందే కనిపిస్తుంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో కనిపిస్తోంది. ఏపీలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పవన్ మరింత క్లారిటీగా మారారు. తనకు ఆప్షన్లు.. తనకున్న పరిమితులతో పాటు.. జగన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించి.. తనను జైలుకు వెళ్లేందుకు వీలుగా ప్రయత్నం చేస్తే.. అందుకు సరేనని జైలుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
విశాఖపట్నంలో తాను నిర్వహించ తలపెట్టిన జనవాణి కార్యక్రమంలో వైసీపీ సర్కారు తప్పుల మీద తప్పులు చేసినట్లుగా చెబుతున్నారు. పవన్ కల్యాణ్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకోవటానికి ముందే.. ఏపీ మంత్రులు ప్రయాణిస్తున్న వాహనాల మీద దాడి చేయటం తెలిసిందే. అయితే.. దాడి జరిగిన ప్రముఖుల్ని చూస్తే.. మంత్రులు జోగి రమేశ్.. ఆర్కే రోజాల వాహనాల మీదనే జనసేన కార్యకర్తలు దాడి చేయటం గమనార్హం. ఆ సమయంలో మరో మంత్రి విడుదల రజని కూడా మరో కారులో ఉన్నా.. ఆమె మీద ఎలాంటి దాడి జరగలేదు.
ఇదంతా చూస్తే.. తాము అమితంగా అభిమానించి.. ఆరాధించే పవన్ ను నోటికి వచ్చినట్లుగా తిట్టిపోయటం.. రాజకీయంగా ఎదుర్కోవాల్సిన రోజా.. అందుకు భిన్నంగా వ్యక్తిగత అంశాల్ని ఎత్తి చూపుతూ.. దారుణంగా మాట్లాడంపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ కోపమే విశాఖ ఎయిర్ పోర్టు వద్ద బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారు. పవన్ రాక ముందుచోటు చేసుకున్న పరిణాల్ని గుర్తించి.. తెలివిగా వ్యవహరించాల్సిన సర్కారు.. అందుకు భిన్నంగాఈ ఇష్యూను సీరియస్ గా తీసుకోవటంతో దీని ప్రాధాన్యత భారీగా పెరిగిపోయింది.
దాడికి పాల్పడిన వారిని రెండు రోజుల తర్వాత అదుపులోకి తీసుకొని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అందుకు భిన్నంగా యుద్ధ ప్రాతిపదికన గుర్తించటం..వారిపై చర్యలు తీసుకోవటం ఒక ఎత్తు అయితే.. ఈ ఎపిసోడ్ తో నేరుగా ఎలాంటి సంబంధం లేని పవన్ ను టార్గెట్ చేసుకున్న రీతిలో ఆయన బస చేసిన హోటల్ కు వచ్చిన పోలీసులు ఆయనతో వ్యవహరించిన తీరును తప్పు పడుతున్నారు. విశాఖ ఎయిర్ పోర్టుకు తాను వచ్చేసరికి గొడవ జరిగితే.. అదంతా తన ప్రోద్బలం ఉన్నట్లుగా పోలీసులు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని పవన్ ప్రస్తావించటం ద్వారా.. జగన్ సర్కారు తనను ఎంతలా టార్గెట్ చేసిందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.
నిజానికి పవన్ ఎయిర్ పోర్టుకు వచ్చే సమయానికి మంత్రుల టీం విశాఖ ఎయిర్ పోర్టుకు వస్తున్న విషయం పవన్ కు ముందే తెలిసే చాన్సు లేదు. ఆ మాటకు వస్తే.. వారి ప్రయాణం గురించి పవన్ కు.. జనసైనికులకు ముందుగా తెలిసే అవకాశం ఉండదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఈ విషయాల్ని పరిగణలోకి తీసుకొని పోలీసులు కాస్తంత సంయమనంతో వ్యవహరించి ఉంటే బాగుండేది.
అందుకు భిన్నంగా సంబంధం లేని ఇష్యూలోకి పవన్ ను లాగటం వల్ల జగన్ సర్కారుకు అదనంగా వచ్చే లాభం ఏమిటన్నది మరో ప్రశ్న. పవన్ కు సంబంధం లేని ఎపిసోడ్ లో ఆయనకు నోటీసులు ఇవ్వటం.. ఆయన్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం ఊపందుకుంది. దీనికి బదులుగా.. తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధమన్న పవన్ మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
తప్పు చేయకుండానే జైలుకు పవన్ పు పంపితే.. దాని కారణంగా అధికార పక్షానికి జరిగే డ్యామేజ్ భారీగా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. తనను అదే పనిగా తనను మాటలతో వేధింపులకు గురి చేస్తున్న జగన్ ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు పవన్ సిద్ధమైనట్లుగా చెబుతున్నారు. తానెంత సంయమనంతో వ్యవహరిస్తున్నా.. తనను రెచ్చగొట్టేలా చేస్తున్న వైసీపీ నేతల తీరుపై పవన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
వారికి సరైన రీతిలో సమాధానం చెప్పే సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. తనకు ఏ మాత్రం సంబంధం లేకున్నా విశాఖ ఎయిర్ పోర్టు దాడి ఎపిసోడ్ లో తనకు బాధ్యత ఉందన్నట్లుగా పోలీసుల వైఖరి ఉండటాన్ని ఆయన తప్పు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేనికైనా సరే సిద్ధమన్నట్లుగా పవన్ తీరు ఉంది. సంబంధం లేని అంశాల్ని కారణాలుగా చూపి కేసులు పెడితే.. జైలుకు వెళ్లటానికైనా సిద్ధమంటూ ఆయన తేల్చేశారు.
ఇదంతా చూస్తే.. జగన్ సర్కారుతో లెక్కలు తేల్చుకునేందుకు సిద్దమవుతున్నారని.. అందుకు తగ్గట్లే ఆయన తాజా వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి. తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధమన్న పవన్ సంసిద్ధత చూస్తే..జనసేనాని అన్నింటికి ప్రిపేర్ అయినట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి వేళలో జగన్ సర్కార్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.