ప్రముఖ సినీ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక భర్త చైతన్య ఓ వివాదంలో ఇరుక్కున్నారు. చైతన్యకు, ఆయన నివసిస్తున్న అపార్ట్ మెంట్ వాసులకు మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఈ క్రమంలోనే అపార్టుమెంట్ వాసులంతా చైతన్యపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో న్యూసెన్స్ కేసు పెట్టారు. అదే సమయంలో అపార్ట్ మెంట్ వాసులపైన చైతన్య కూడా ఫిర్యాదు చేశారు. రెండు ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. రాజీకి ఇరు వర్గాలు అంగీకరించడంతో తాజాగా ఈ వివాదం సద్దుమణిగింది.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్ మెంట్ లో చైతన్య ఓ ప్లాట్ అద్దెకు తీసుకున్నారు. అయితే, అపార్టుమెంట్లో ఆఫీస్ పెట్టటానికి వీల్లేదని అపార్టుమెంట్ వాసులు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలోనే అపార్ట్ మెంట్ వాసులకు, చైతన్యకు మధ్య మాటా మాటా పెరిగి గొడవైంది. దీంతో, అపార్ట్ మెంట్ లో చైతన్య న్యూసెన్స్ చేస్తున్నారంటూ అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజులుగా చైతన్య ఫ్లాట్‌కు కొంతమంది యువకులు వచ్చి మద్యం సేవించి నానా హంగామా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే, తమ ఆఫీస్‌లోకి అక్రమంగా ప్రవేశించి గొడవకు దిగారని చైతన్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, ఇరువర్గాల ఫిర్యాదులపై విచారణ చేపట్టిన పోలీసులు…వాగ్వాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఇరు వర్గాలను స్టేషన్‌కు పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలు రాజీకి వచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. దీంతో, ఈ వివాదం సద్దుమణిగినట్టయింది.