బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఓ దొంగ ముంబైలోని సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడు. దొంగతనాన్ని యత్నిస్తున్న దొంగ సైఫ్ కంట పడటంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దుండగుడు దాడికి పాల్పడి పరార్ అవ్వగా.. సైఫ్ అలీఖాన్ తీవ్ర గాయాలతో కుప్పకూలారు.
కుటుంబసభ్యులు వెంటనే ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో ఆయన్ను చేర్చారు. ప్రస్తుతం సైఫ్ చికిత్స తీసుకుంటున్నాడు. దుండగుడితో జరిగిన ఘర్షణలో సైఫ్ ఒంటిపై ఆరు కత్తిపోట్లు పడ్డాయి. వెన్నెముఖ పక్కన తీవ్ర గాయం కావడంతో వైద్యులు సర్జరీ చేస్తున్నారు. మరోవైపు సమాచారం అందుకున్న ముంబై పోలీసులు సైఫ్ ఇంటికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగుడు దొంగతనం చేయడానికే వచ్చాడా? లేక దాడి వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. అలాగే పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు పలు బృందాలుగా ఏర్పడ్డారు.
ఇక ఈ ఘటనపై టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. ` సైఫ్‌పై జరిగిన దాడి గురించి విని షాక్‌కు గురయ్యాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.` అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. కాగా, దేవర మూవీలో ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్ స్క్రీన్ చేసుకున్నారు. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం గత ఏడాది విడుదలైన సంచలన విజయాన్ని నమోదు చేసింది. త్వరలోనే దేవర 2 సెట్స్ మీదకు కూడా వెళ్లనుంది.