అగ్రరాజ్యం అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో రేగిన హెచ్-1 బీ వీసా వివాదం మరోసారి తెరమీదికి వచ్చింది. హెచ్-1బీ వీసా విధానంపై యూఎస్ అనుసరిస్తున్న తీరు, శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్ కార్డుల జారీలో దేశాల వారీ కోటా(కంట్రీ క్యాప్) విషయంలో అమెరికా అనుసరిస్తున్న తీరుతో భారతీయులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. హెచ్-1బీ వీసా విధానంలో అమెరికా వ్యవహరిస్తున్న తీరుతో ఈ వీసాలకు కాలం చెల్లుతోంది. దీంతో భారీ సంఖ్యలో ప్రతిభావంతులైన భారతీయ యువత అగ్రరాజ్యం అమెరికాను కాదని.. కెనడావైపు తరలిపోతున్నారు.
ఇదే విషయంపై ఇమ్మిగ్రేషన్ అండ్ పాలసీ నిపుణులు అమెరికా చట్టసభ్యులకు తెలిపారు. ఈనేపథ్యంలో కాలం చెల్లిన అమెరికా వీసా విధానాలను సవరించాల్సిన సమయం ఆసన్నమైందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇండియన్ టాలెంట్ కెనడాకు తరలిపోకుండా వెంటనే తగిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్‌ను కోరారు. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టువర్ట్ అండర్సన్ మాట్లాడుతూ.. మూడు ఉద్యోగ ఆధారిత విభాగాల బ్యాక్‌లాగుల్లో భారత ప్రవాసుల వాటా ప్రస్తుతం 9,15,497గా ఉందన్నారు. ఈ సంఖ్య 2030 నాటికి 21,95,795కు చేరుతుందని ఆయన అంచనా వేశారు.
అలాగే సుమారు 20 లక్షల మంది దశాబ్దం పాటు ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డు కోసం వేచిచూడాల్సి వస్తుందని వలసలు, పౌరసత్వానికి సంబంధించి హౌస్ జ్యుడిషియరీ కమిటీ ముందు అండర్సన్ తన వాదనలు వినిపించారు. ప్రస్తుతం అగ్రరాజ్యం అనుసరిస్తున్న కాలం చెల్లిన వీసా విధానాల వల్ల విదేశీయులు అమెరికాకు రావడానికి జంకుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అదే సమయంలో కెనడా.. విదేశీ విద్యార్థులు, నిపుణులకు వీసా విధానం సులభతరం చేయడం కూడా ఆ దేశానికి భారతీయ యువత తరలిపోవడానికి కారణమవుతోందని అండర్సన్ పేర్కొన్నారు.
మూడు ఉద్యోగ ఆధారిత విభాగాల బ్యాక్‌లాగుల్లో భారతీయుల వాటా ప్రస్తుతం 9.15 లక్షలుగా ఉందన్న అధికారులు.. ఈ సంఖ్య 2030 నాటికి 21.95 లక్షలకు చేరుతుందని అంచనావేశారు. సుమారు 20 లక్షల మంది దశాబ్దం పాటు ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డు కోసం వేచిచూడాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు వలసలు, పౌరసత్వానికి సంబంధించి హౌస్ జ్యుడిషియరీ కమిటీ ముందు అధికారులు తమ వాదనలు వినిపించారు. భారతీయ ప్రతిభ అమెరికా నుంచి కెనడా వైపు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ను కోరారు. అయితే, దీనిపై అమెరికా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.