ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి.. ఇప్పటికి 9 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2014 జూన్ 2న కేంద్ర ప్రభు త్వం ఉమ్మడి ఏపీని విడదీస్తూ.. తీసుకున్న నిర్ణయం అప్పట్లో సంచలనంగా మారింది. తెలంగాణను కొత్త రాష్ట్రంగా పేర్కొంది. ఇక, తెలంగాణలో ఈ 9 ఏళ్ల సంబరాలను దశాబ్ది ఉత్సవాల పేరుతో అన్ని పార్టీలు ఘనంగా చేసుకుంటున్నాయి. ఈ 9 ఏళ్ల కాలంలో బీ(టీ)ఆర్ ఎస్ ప్రభుత్వమే ఇక్కడ ఉంది. దీంతో గడిచిన 9 సంవత్సరాల్లో ఆ పార్టీ అంతో ఇంతో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించింది.
ఇక, ఏపీ విషయానికి వస్తే.. మాత్రం ఈ 9 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి ఏదీ? అంటే.. ప్రస్తుత ప్రభుత్వం నీళ్లు నమిలే పరిస్థితి ఏర్పడింది. నిజానికి చెప్పలంటే.. గత 2014లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు అయింది. విజన్ ఉన్న నాయకుడిగా ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని కూడా అనుకున్నారు. అనుకున్నట్టుగానే చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. కేంద్రం నుంచి సహకారం నామమాత్రంగానే ఉన్నా..ఆయన తనదైన శైలిలో ముందుకు సాగారు.
ఈ విషయంలో పార్టీలను విమర్శించే మేధావులు కూడా చంద్రబాబు చేసిన ప్రయత్నాలను మాత్రం విమర్శించేందుకు సాహసించరు. 2015లోనే అమరావతి రాజధానికి అంకురార్పణ చేశారు. ఇక, హైదరాబాద్, సైబరాబాద్‌కు దీటుగా.. విశాఖలో ఐటీ విప్లవం తీసుకురావాలని తపించారు. అదేవిధంగా పరిశ్రమలకు సైతం పెద్దపీట వేశారు. వివిధ జిల్లాల్లో.. పరిశ్రమల ఏర్పాటుకు.. ప్రాధాన్యం ఇచ్చారు. యువతకు ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేశారు.
అంటే.. తొలి ఐదేళ్లు ప్రజలు కోరుకున్నట్టుగా ఏపీలో అభివృద్ధి తాలూకు ఆనవాళ్లు కనిపించాయి. అయితే.. చిన్న చిన్న లోపాలు ఏ ప్రభుత్వంలో నైనా ఉన్నట్టుగానే చంద్రబాబు సర్కారులోనూ కనిపించాయి. దీంతో ప్రజలు జరుగుతున్న అభివృద్ధిని మరింత దూకుడుగా తన వ్యాపార దక్షతతో ముందుకు తీసుకువెళ్తారని జగన్‌కు పట్టం కట్టారు. అంతే!
గత నాలుగేళ్లుగా.. భూతద్దం పట్టుకుని వెతికినా.. అభివృద్ధి లేదు. అసలు రాజధానే లేని రాష్ట్రంగా ఏపీ నిలిచింది. మొత్తానికి ఈ 9 ఏళ్ల రాష్ట్ర చరిత్ర తీసుకుంటే.. ఏమీ కనిపించకుండా చేయడంలో వైసీపీ ప్రభుత్వం సక్సెస్ అయిందని అంటున్నారు పరిశీలకులు.