ఔను.. ఇతర జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. నెల్లూరులో మాత్రం వైసీపీ పరిస్థితి ఏమీ బాగోలేదని అం టున్నారు పరిశీలకులు. దీనికి కారణం.. నేతల్లో ఇంకా అసంతృప్తి రగులుతూ ఉండడమేనని చెబుతున్నా రు. తాజాగా రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉదంతం. రెండు.. ఉదయగిరిలో సీఎం జగన్ ప్లెక్సీలను చించేయడం.
ఈ రెండు పరిణామాలు.. కూడా ఏదో యాదృచ్ఛికంగా జరిగినవని చెప్పేందుకు వీలు లేదు. ఉద్దేశ పూర్వ కంగానేచోటు చేసుకున్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి.. ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. తనకు మంత్రి పదవిని ఖచ్చితంగా ఇస్తారని ఆయన ఆశలు పెట్టుకున్నారు.కానీ, రాలేదు. ఇక, అప్పటి నుంచి ఆయన అక్కసుతోనే ఉన్నారు.
తాజాగా జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులు మారినా.. అభివృద్ది మారడం లేదన్నారు. ఇలాగే వ్యవహరిస్తే.. తానే రంగంలోకి దిగి ధర్నా చేస్తానని చెప్పారు. ఇది ఊహించని పరిణామమేమీ కాదు. గతంలోనూ మురిగి గుంటలో కూర్చుని.. మరీ నిరసన వ్యక్తం చేశారు. ఇక, ఈ సమయంలో మానుగుంట మహీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వంటి వారు కూడా.. ఈయనకు మద్దతుగా మాట్లాడారు.
ఇది మాత్రం ఊహించని ఘటనే. సో.. మొత్తానికి నెల్లూరులో రెడ్డి వర్గం ఆగ్రహంతోనే ఉంది. ఇక, ఉదయ గిరిలో.. ఆధిపత్య రాజకీయం మరోసారి తెరమీదికి వచ్చింది. ఇక్కడి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి.. వర్సెస్ లోకల్ లీడర్లకు మధ్య జరుగుతున్న పోరు..తారస్థాయికి చేరింది. సీఎం జగన్ పుట్టిన రోజు ను పురస్కరించుకుని కట్టి న ఫ్లెక్సీలను ఇరు వర్గాలు చింపేసే పరిస్థితి వచ్చింది. మొత్తానికి నిన్న మొన్నటి వరకు ఎంతో కలివిడిగా ఉన్న ఉదయగిరి నియోజకవర్గం ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా మారింది.