మన దేశంలో సినీ తారలకు, క్రీడాకారులకు అవినాభావ సంబంధం ఉంది. సినీ నటులు, క్రికెటర్లు జంటపదాల్లా మారిపోయారంటే అతిశయోక్తి కాదు. అజహరుద్దీన్, సంగీతా బిజ్లానీలతో మొదలైన ఈ వ్యవహారం విరాట్ కోహ్లీ, అనుష్క వరకూ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే మన దేశంలో ప్రజలు అత్యంత ఆసక్తి కనబరిచే రెండు ప్రధాన రంగాలైన క్రికెట్, సినిమాల గురించి ఏ చిన్న వార్త వచ్చినా సరే అది క్షణాల్లో వైరల్ అవుతోంది.
అదీగాక, సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన ఈ జమానాలో క్రికెటర్లు, సినీతారలు కలిసి నటించే చిన్న యాడ్ అయినా సరే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటోంది. అయితే, అది ఫేక్ న్యూసా, గాసిప్పా, నిజమా అన్న సంగతి పట్టించుకోకుండా…గంటల వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్….అబ్బో ఇలా అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లలో ఆ వార్తో, ఫొటోనో చక్కర్లు కొడుతూనే ఉంటుంది.
ఈ కోవలోనే టీమిండియా మాజీ సారథి, స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ సినీ రంగ ప్రవేశం చేయబోతున్నారంటూ ఓ వార్త గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో షికార్లు చేస్తోంది. అంతేకాదు, ధోనీ నిర్మాతగా కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతోన్న సినిమాలో కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోందన్న పుకారుతో ఆ వార్తకు మరింత మసాలా యాడ్ అయింది. ధోనీ నిర్మాణ సంస్థలో రాబోతోన్న తొలి సినిమాలో నయన్ లేడీ ఓరియెంట్ స్క్రిప్ట్ తో నటిస్తోందని, ఆ సినిమా మామూలుగా ఉండదని ధోనీ, నయ్ ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ పుకార్లపై ధోని ఎంటర్ టైన్మెంట్ టీమ్ స్పందించింది. దయచేసి ఇలాంటి పుకార్లని నమ్మొద్దని, ప్రస్తుతానికి తమ టీమ్ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తోందని వెల్లడించింది. అంతేకాదు, త్వరలోనే ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు ప్రకటిస్తామని పేర్కొంది. దీంతో, నయనతారతో ధోని సినిమా నిర్మించబోతున్నాడనే వార్తలు ప్రస్తుతానికి నిజం కాదని తేలిపోయింది. మరోవైపు, నయనతార ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.