5 కోట్ల మంది ఆంధ్రుల కల నెరవేర్చేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఏడేళ్లు గడిచిన సంగతి తెలిసిందే. భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా దేశంలోకెల్లా అద్భుతమైన రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు పునాదులు పడి ఏళ్లు గడుస్తున్నాయి. అయితే, జగన్ వంటి పాలకుల వల్ల అమరావతి సర్వనాశనం అయిందని, ఎన్నికలకు ముందు అమరావతిపై ప్రేమ ఒలకబోసి మద్దతు పలికిన జగన్ అధికారంలోకి రాగానే మాట మార్చి మూడు రాజధానులంటూ ప్రకటనలు చేస్తున్న వైనంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా అమరావతి రాజధానిపై లోక్ సభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఎంపీ గల్లా జయదేవ్ తన వాణి వినిపించారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని ఆయన సభాముఖంగా డిమాండ్ చేశారు. మూడేళ్లుగా రైతులు తమ హక్కుల కోసం చరిత్రాత్మక పోరాటం చేస్తున్నారని గల్లా అన్నారు.అమరావతి కోసం 29 గ్రామాల రైతులు 33 వేల ఎకరాల సారవంతమైన భూమిని తృణ ప్రాయంగా త్యజించారని గల్లా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ప్రకటించాలని ప్రధాని నరేంద్రమోదీని కోరుతున్నామని అన్నారు.
వారిని ఆదుకోవాలని కోరారు. పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం తదితర అంశాలను పరిష్కరించాలని ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీకి 18 హామీలు ఇచ్చారని, 2024తో ఐదేళ్ల గడువు ముగియబోతున్నా ఆ హామీలు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే కేంద్ర బడ్జెట్ ఏపీకి ఎంతో కీలకమైందని, నవ్యాంధ్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా నిధులు కేటాయించాలని కోరారు.