భారత ప్రధాని నరేంద్ర మోదీ….ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న దేశాధినేతల్లో ఒకరిగా ఖ్యాతిగడించిన సంగతి తెలిసిందే. వరుసగా రెండుసార్లు దేశ ప్రధానిగా ఎన్నికలైన మోదీకి ఇటు సోషల్ మీడియాలోనూ అటు అంతర్జాతీయ మీడియాలోనూ పేరుంది. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో అమెరికా సహా పలు దేశాలకు హైడ్రాక్సి క్లోరోక్విన్ ను సరఫరా చేసి మోడీ హీరో అయ్యారు. అయితే, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మోడీ ఇన్నాళ్లూ సంపాదించుకున్న ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణకు మోడీనే కారణమని అంతర్జాతీయ మీడియా ఏకిపారేసింది.
ఇక తాజాగా అమెరికాకు చెందిన డేటా ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్స్ చేసిన సర్వేలోనూ మోదీ రేటింగ్ అత్యంత కనిష్ఠానికి పడిపోయింది.
ప్రపంచస్థాయి నేతల పాపులారిటీని ట్రాక్ చేసి మార్నింగ్స్ కన్సల్ట్స్ నివేదికలు రూపొందిస్తుంటుంది. తాజాగా వెల్లడైన ఆ నివేదికలో ఈ వారం మోదీ ఓవరాల్ రేటింగ్ 63 శాతానికి పడిపోయింది. ఆగస్టు 2019 నుంచి మోదీ పాపులారిటీని ట్రాక్ చేస్తుండగా…అత్యంత కనిష్ఠ రేటింగ్ ఇదేనని ఆ సంస్థ పేర్కొంది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ పై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా…ఎన్నికలపై ఫోకస్ చేయడం, రోజుకు 4 వేల మరణాలు… 4లక్షలకు పైగా కేసులు నమోదు కావడం, కరోనా కేసుల సంఖ్య 2.5 కోట్లు దాటడం, దేశంలోని ఆసుపత్రుల్లో బెడ్ల కొరత, ఆక్సిజన్ లేక కొవిడ్ రోగులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతుండడం, ఆసుపత్రుల్లో బెడ్ల కోసం వేసి చూసి పార్కింగ్ ప్రదేశాల్లోనే చనిపోతుండడం, శ్మశాన వాటికల్లో అంత్యక్రియలకు క్యూలు వంటి విషయాలు మోడీ ప్రతిష్ఠను మసకబార్చాయి.
సుప్రీంకోర్టు కూడా కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితిపై కేంద్రాన్ని నిలదీయడం, సుమోటోగా స్వీకరించి పలు సూచనలు, ఆదేశాలివ్వడం, 5 రాష్ట్రాల ఎన్నికలు..ముఖ్యంగా రైతుల ఉద్యమం, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు, కుంభమేళా, వ్యాక్సిన్లను విదేశాలకు ఎగుమతి చేయడం వంటి వ్యవహారాలు కూడా మోడీ ప్రతిష్టను దిగజార్చాయి.