మోడీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టం-2019(సీఏఏ) దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. 2019లో సిఏఏను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ చట్టానికి పార్లమెంటు ఆమోదం కూడా లభించింది. దానికి రాష్ట్రపతి రాజముద్ర కూడా వేశారు. అయితే, సీఏఏ నిబంధనలు, మార్గదర్శకాలపై స్పష్టత లేకపోవడంతో దాన్ని అమలు చేయలేదు. సీఏఏ చట్టంపై దేశవ్యాప్తంగా ముస్లింలతో పాటు పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని నిరసనలు, ఆందోళనలు చేపట్టారు.
ఆ క్రమంలో దాదాపుగా వంద మందికి పైగా ఈ నిరసనలు, ఆందోళనలలో చనిపోయారు. ఈ నేపద్యంలోని అప్పట్లో ఆ చట్టం అమలుపై ఎన్డీఏ సర్కారు వెనక్కు తగ్గింది. అయితే, తాజాగా 2024 ఎన్నికల ముంగిట మోడీ సర్కార్ సిఏఏ తేనె తుట్టెను మరోసారి కదిలించింది. మార్చి 11 అర్థరాత్రి నుంచి సిఏఏ చట్టం అమల్లోకి వస్తుందంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేయడం సంచలనం రేపుతోంది. ఈ చట్ట ప్రకారం బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి 2014 డిసెంబర్ 31 ముందు భారత్ లోకి ప్రవేశించిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులు, పార్సీలు, జైనులు భారత పౌరసత్వం పొందేందుకు సీఏఏ చట్టం రూపొందించారు. వారి దగ్గర సరైన పత్రాలు లేకపోయినప్పటికీ వారికి భారత పౌరసత్వం లభిస్తుంది.
అయితే, ఇందులో ముస్లింలను చేర్చకపోవడంతో బీజేపీ మత రాజకీయాలను చేస్తోందని, అందుకే ముస్లింలను అందులో చేర్చలేదని తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ చట్టాన్ని కేరళ సీఎం పినరాయి విజయన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు, ఈ చట్టానికి వ్యతిరేకంగా యావత్ కేరళ ఏకతాటిపై నిలబడాలని విజయన్ పిలుపునిచ్చారు. ఈ చట్టంపై లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా స్పందిస్తారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. సీఏఏ రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మతం ఆధారంగా కాకుండా ఆయా దేశాలలో మతపరమైన హింసకు గురైన వారికి ఆశ్రయం కల్పించాలని ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సూచించారు. 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ బిల్లును అమలు చేస్తున్నారని, మతపరమైన రాజకీయాలకు బీజేపీ మరోసారి తెరతీసిందని విమర్శించారు.