కారణం ఏమైనా కానీ.. అంతిమంగా కేంద్ర ప్రభుత్వానికి కాసులు వచ్చేలా చేయటం అలవాటుగా మారింది మోడీ ప్రభుత్వానికి. ఇప్పటికే పెట్రోల్.. డీజిల్ మొదలు కొని రైల్ టికెట్ల వరకు ఏ మాత్రం అవకాశం ఉన్నా వదిలిపెట్టిన మోడీ సర్కారు.. తాజాగా మరోసారి తన సత్తా చాటారు. ఇప్పటివరకు ప్లాట్ ఫాం టికెట్ రూ.10 మాత్రమే ఉండేది. దాన్ని రూ.30లకు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
అయితే.. ఈ పెంచిన ధర తాత్కాలికమేనని రైల్వే శాఖ చెబుతోంది. కరోనా వ్యాప్తి కట్టడికి తమ బాధ్యత అని పేర్కొన్న రైల్వే శాఖ.. రైల్వేస్టేషన్లలో గుమిగూడటాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొంది. ప్లాట్ ఫామ్ టికెట్ ధరలపై ఇటీవల సమీక్షించిన రైల్వే బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. పెంచిన ప్లాట్ ఫాం టికెట్ ధరల నిర్ణయాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని పేర్కొంటూ అన్ని జోన్లకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదంతా చూస్తే.. రానున్నరోజుల్లో రైల్వే శాఖ.. ఫ్లాట్ ఫాం టికెట్లను రూ.30గా డిసైడ్ చేసేలా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. దేశంలో లాక్ డౌన్ వేళ.. అన్ని రైళ్లను నిలిపివేసిన రైల్వే శాఖ.. అన్ లాక్ తర్వాత రైళ్లను వాయిదాల పద్దతిలో పట్టాల మీదకు తెస్తోంది. దేశంలో అన్ని ప్రజా రవాణాలు ఒక కొలిక్కి వచ్చినప్పటికీ.. రైల్వేలు ఇప్పటికి ప్యాసింజర్ రైళ్లతో పాటు.. చాలా రైళ్లను అందుబాటులోకి తీసుకురావటం లేదు. అంతేనా.. మామూలు రైళ్లను ప్రత్యేక రైళ్ల పేరుతో నడుపుతూ.. ఛార్జీలను బాదేస్తున్నారు.
అసలు రైళ్లే అంతంత మాత్రంగా ఉన్న వేళ.. రైల్వేస్టేషన్లకు వెళ్లే వారు తగ్గిపోయారు. ఇలాంటివేళ.. ఫ్లాట్ ఫాం మీద రద్దీని తగ్గించేందుకు ప్లాట్ ఫాం టికెట్ ధరల్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయం అర్థం లేనిదన్న మాట వినిపిస్తోంది. రైల్వే శాఖ తీరు చూస్తే.. ఏదో ఒక పేరు చెప్పి బాదేయటం అన్నది ఒక అలవాటుగా మారిందా? అన్నది ప్రశ్నగా మారింది.