రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన జీ 20 సదస్సు వేళ.. అభిలపక్ష సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరు కావటం తెలిసిందే. ముఖ్యనేతల్ని ఒకరి తర్వాత ఒకరు చొప్పున పలకరించుకుంటూ వెళ్లటం తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడినపుడు మోడీ… జగన్ సోదరి షర్మిల కు ఇటీవల తెలంగాణలో ఎదురైన దారుణ అవమానం గురించి ప్రస్తావించటం ఆసక్తికరంగా మారింది. మీ చెల్లెలు షర్మిలను కారు లోపలే ఉండగానే ఆమెను.. కారుతో సహా టోయింగ్ వాహనంతో పోలీస్ స్టేషన్ కు తరలించారట కదా? ఇంత జరిగినా మీరెందుకు స్పందించలేదు? అంటూ సీఎం జగన్ ను మోడీ అడిగేశారట.
ప్రధాని నోటి నుంచి ఈ తరహా మాటలు ఎదురవుతాయని అస్సలు ఊహించని జగన్ సమాధానం చెప్పలేక.. మౌనంగా ఉన్నట్లుగా ఒక మీడియా సంస్థలో ప్రముఖంగా వచ్చింది. అదెంతవరకు నిజం? ప్రధాని ఒక ముఖ్యమంత్రితో మాట్లాడింది ఎలా బయటకు వచ్చింది? అన్న ప్రశ్న చాలామందికి కలుగుతోంది. అయితే.. ఆ సమాచారం బయటకు రావటం వెనుక ఆ మీడియా సంస్థ అధినేత ఉన్నట్లుగా చెబుతున్నారు. సంచలనంగా మారిన ఈ ఉదంతం వెనుక అసలేం జరిగింది? అన్న ప్రశ్నకు సమాధానాన్ని వెతికినప్పుడు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
సదరు మీడియా సంస్థకు చెందిన అధినేత స్వతహాగా జర్నలిస్టు కావటం.. ఏదైనా పరిణామం జరిగిన వెంటనే తన నెట్ వర్కు అందించే సమాచారంతో పాటు.. తనకున్న పరిచయాలతోనూ సమాచారం సేకరించే అలవాటు ఆయనకు మొదట్నించి ఉంది. నిత్యం పలువురితో మాట్లాడటం.. ప్రతి పరిణామం వెనుక ఏం జరుగుతుందన్న విషయాన్ని గుర్తించటం ఆయనకు అలవాటుగా చెబుతారు.
ఈ క్రమంలో ఢిల్లీలో జరిగిన కార్యక్రమం గురించి కొందరు నేతలతో మాట్లాడిన సందర్భంలో ముఖ్యమంత్రి జగన్ ను ప్రధాని మోడీ మాట్లాడిన మాటల ప్రస్తావన తెలిసింది. ఇదంతా ఓపెన్ గా జరగటంతో.. జగన్ తో ప్రధాని ఏం మాట్లాడారన్న ఆసక్తి ఉన్న వారి నుంచి సదరు మీడియా అధినేతకు తెలియటం.. ఆ వెంటనే క్రాస్ చెక్ చేయించిన ఆయన ఆ కథనాన్ని హైలెట్ చేయాల్సిందిగా తన సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
జగన్ ఇరుకున పడే ఏ విషయాన్ని వదిలేందుకు ఇష్టం లేని సదరు మీడియా అధినేత ప్రత్యేక శ్రద్ధతో ఈ విషయం బయటకువచ్చినట్లుగా చెబుతున్నారు. పలువురు ఈ కథనాన్ని నమ్మలేదని.. కావాలని వండినట్లుగా ఆరోపణలు చేయగా.. మంగళవారం ప్రధాని మోడీనే స్వయంగా షర్మిలకు ఫోన్ చేయటంతో.. సదరు మీడియా అధినేత నెట్ వర్కు ఎంత బలంగా ఉంటుందన్న విషయం చాలామందికి అర్థమైందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.