కరోనా కాలంలో ఆదివాసీలను ఆదుకున్న కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్కపై ప్రశంసల జల్లు కురిసిన సంగతి తెలిసిందే. ఓ ఎమ్మెల్యే హోదాలో ఉన్న సీతక్క సామాన్యురాలిగా మారి కాలినడకన కిలోమీటర్ల కొద్దీ నడిచి మరీ ఆదివాసీలకు నిత్యావరసరాలు, మందులు పంపిణీ చేసిన వైనంపై పార్టీలకతీతంగా నేతలంతా ప్రశంసించారు. తన నియోజకవర్గ ప్రజలతో పాటు గతంలో ఉద్యమంలో తనతో పనిచేసిన వారినీ మరచిపోలేదు.
ఈ క్రమంలోనే సీతక్క తన పెద్దమనసును మరోసారి చాటుకున్నారు. ఇటీవల మరణించిన మావోయిస్టు నేత హరిభూషణ్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న సందర్భంగా సీతక్క కంటతడి పెట్టి భావోద్వేగానికి లోనయ్యారు. హరిభూషణ్ మరణంపై విచారం వ్యక్తం చేసిన సీతక్క…హరిభూషణ్ ప్రజల మనిషి అని కొనియాడారు. హరిభూషణ్ కుటుంబసభ్యులు సీతక్కను పట్టుకుని బోరున విలపించారు.
హరిభూషణ్ ను గుర్తు చేసుకొని సీతక్క కూడా కంటతడి పెట్టుకుని ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆనాడు తాను ఉద్యమంలో ఉన్నపుడు హరిభూషణ్ తో ఉన్న అనుబంధాన్ని సీతక్క గుర్తు చేసుకున్నారు. పాకాల కొత్తగూడ ప్రాంతంలో హరిభూషణ్ టీం లీడర్ గా ఉన్నప్పుడు తానూ ఆ ప్రాంత ప్రజల హక్కుల కోసం ఉద్యమంలో పనిచేశానని సీతక్క గుర్తుచేసుకున్నారు. ఏది ఏమైనా ఎమ్మెల్యే హోదాలో ఉన్న సీతక్క తన ఉద్యమసహచరులను మరచిపోకపోవడం, వారి మరణాన్ని తట్టుకోలేక భావోద్వేగానికి గురి కావడం ఆమె పెద్దమనసుకు నిదర్శనమని ప్రశంసలు కురుస్తున్నాయి.