కనిష్ఠ ఉష్ణోగ్రతలు అన్నంతనే సింగిల్ డిజిట్ విన్నంతనే వామ్మో అనుకుంటాం. ఇక.. దాన్ని ఫేస్ చేసే వేళలో.. పాడు చలి అంటూ తిట్టేసుకోవటమే తిట్టేసుకోవటం. ఒక్కపని చేసుకోవటానికి కూడా వీల్లేకుండా ఉందని తెగ ఫీల్ అయిపోతాం. అలాంటిది.. మైనస్ 79 డిగ్రీల ఉష్ణోగ్రత అంటే మాటలా? ఆ అంకె విన్నంతనే వణుకు పుట్టేయటమే కాదు.. ఇంతటి కనిష్ఠ ఉష్ణోగ్రత ఎక్కడ? అన్న ఆసక్తి వ్యక్తమవుతుంది.
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యంగా అందరి నోట కీర్తించుకునేలా చేసుకునే అమెరికాను కొట్టేవారే లేరన్నట్లుగా ఉంటుంది. కానీ.. ఆగ్రరాజ్యానికి ఎప్పటికప్పుడు పరీక్షలు పెట్టేందుకు ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. అక్కడి హరికేన్ లు కావొచ్చు. కార్చిచ్చు కావొచ్చు.. అత్యంత శీతల పరిస్థితులు కావొచ్చు. భారీ సవాళ్లను విసురుతుంటాయి. ఇందుకు తగ్గట్లే తాజాగా అమెరికాలోని శీతాకాలం అదరగొట్టేస్తుంది.
రికార్డు స్థాయి శీతల గాలులతో అమెరికాలోని పలు ప్రాంతాలు గజగజలాడుతున్నాయి. తాజాగా ఆర్కిటిక్ నుంచి వీస్తున్న అతి బలమైన చలిగాలుల కారణంగా అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఈ వణికిపోతున్న రాష్ట్రాల జాబితాలో న్యూయార్క్ తో సహా మరో ఏడు రాష్ట్రాలు ఉన్నాయి.
అన్నింటికి మించి మౌంట్ వాషింగ్టన్ ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. ఇప్పుడు అక్కడి టెంపరేచర్ ఎంతో తెలుసా? అక్షరాల మైనస్ 79 డిగ్రీలు. దీంతో.. ఎక్కడికక్కడ మంచుతో గడ్డ కట్టుకున్న పరిస్థితి. మైనస్ 79 డిగ్రీలు అన్న మాట వింటేనే వణుకు పుట్టటం ఖాయం. అలాంటిది ఆ టెంపరేచర్ర లో బతుకుతున్న వారి పరిస్థితి ఏమిటి? దేవుడా అనుకోకుండా ఉండలేం కదూ?