మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మైనింగ్ డాన్ గా మారారని, కుప్పం నియోజకవర్గంలో ఆయన అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, స్థానిక మైనింగ్, క్రషింగ్ వ్యాపారులను పెద్ది రెడ్డి బెదిరిస్తున్నారని, కోట్లు కొల్లగుడుతున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో, పెద్దిరెడ్డి అక్రమాలపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గతంలో అన్నారు. అఖండ సినిమాకు మించిన రీతిలో కుప్పంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు.
ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి బాధితుడు ఒకరు మీడియా ముందుకు వచ్చి సంచలన విషయాలు వెల్లడించారు. పెద్ది రెడ్డి అక్రమాలను, అన్యాయాలను కళ్లకు కట్టినట్లుగా వివరించారు. తాను పెద్ది రెడ్డి బాధితుడినని, తనను బెదిరించి తనకు చెందిన శ్రీవెంకటేశ్వర క్రషర్స్ ను ఆయన స్వాధీనం చేసుకున్నారని జనార్థన్ నాయుడు అనే వ్యాపారి ఆరోపించారు. తాను 2019లో ఆ క్రషింగ్ యూనిట్ ను వేరే వ్యక్తి దగ్గర నుంచి కొన్నానని, అప్పటికే ఆ యూనిట్ పై 33లక్షలు అప్పు ఉన్న సంగతి తనకు తెలియదని చెప్పారు.
అయితే, ఆ తర్వాత ఆ క్రషర్స్ కు సంబంధించి 19 లక్షలు గవర్నమెంట్ కు కట్టి రికార్డులు సరిచేసుకొని క్రషర్స్ ను విస్తరించానని, దాదాపు పది కోట్లు పెట్టుబడి పెట్టి క్రషర్స్ ను డెవలప్ చేశానని అన్నారు. 2019 అక్టోబర్ లో రన్నింగ్ లోకి వచ్చిన క్రషర్స్…రెండు నెలల పాటు సజావుగా సాగిందని, ఆ తర్వాత హఠాత్తుగా అధికారులు తన క్రషింగ్ యూనిట్ ఆపేయాలంటూ ఆదేశాలిచ్చారని అన్నారు.
అన్ని అనుమతులు ఉన్నప్పటికీ…లోకల్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఒత్తిడి వల్లే మైనింగ్ ఆపేయాల్సి వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత 10-20 సార్లు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి గారిని కలిసేందుకు ప్రయత్నించానని, సెక్రటేరియట్ కు వెళ్లానని, అయినా పెద్దిరెడ్డిగారు కలవలేదని చెప్పారు. చివరకు, మధ్యవర్తుల ద్వారా 2020లో పెద్దిరెడ్డిగారికి తన క్రషింగ్ యూనిన్ అప్పగించానని, వారు తన ప్రాపర్టీని ఆక్యుపై చేశారని చెప్పారు. అందుకుగాను, తనకు నెలకు పది లక్షలు ఇస్తామని పెద్దిరెడ్డి తరఫు వ్యక్తులు చెప్పారని అన్నారు.
అంతేకాదు, క్రషింగ్ యూనిట్ కోసం కొన్న వాహనాలకు ఈఎంఐలు కడతామని కూడా చెప్పారని అన్నారు. కానీ, ఇంతవరకు తనకు ఒక్క రూపాయి చెల్లించలేదని తన ఫ్యామిలీ రోడ్డుపై పడిందని జనార్ధన్ వాపోయారు. దీంతో, కోలార్ జిల్లా స్థాయి బీజేపీ నేత అయిన తాను కోలార్ ఎంపీకి విషయం చెబితే….ఆయన పెద్దిరెడ్డితో మాట్లాడి సెటిల్మెంట్ చేశారని, త్వరలోనే డబ్బులు ఇస్తామని చెప్పారని వెల్లడించారు.
ఆ తర్వాత ఢిల్లీలో మిథున్ రెడ్డి దగ్గర పంచాయతీ జరిగిందని, అయినా సరే డబ్బులు ఇవ్వలేదని అన్నారు. చివరకు కోలార్ ఎంపీగారు, తాను కలిసి పెద్దిరెడ్డి ఇంటికి వెళ్లామని, అపుడు పెద్దిరెడ్డి రూ.37 లక్షల ఐడీబీఐ బ్యాంకు చెక్కు ఇచ్చారని, చివరకు ఆ చెక్కు బౌన్స్ అయిందని చెప్పారు. దీంతో, పెద్దిరెడ్డికి లీగల్ నోటీసులు పంపి కేజీఎఫ్ కోర్టులో కేసు వేశానని, ఇప్పటిదాకా తనకు ఒక్క రూపాయి కూడా పెద్ది రెడ్డి ఇవ్వలేదని, తనకు సీఎం జగన్ న్యాయం చేయాలని కోరారు.
Comments 1