ఇటీవల వెలువడిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ హవా కొనసాగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా యూపీలో యోగి ఆదిత్య నాథ్ ఆధ్వర్యంలోని బీజేపీ 273 స్థానాలు గెలుచుకొని మిగతా పార్టీలకు షాకిచ్చింది. ఎస్పీ మాత్రం 125 స్థానాలు గెలుచుకొని బీజేపీకి కొంతవరకు గట్టిపోటీనిచ్చింది. కానీ, యూపీ మాజీ సీఎం మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ మాత్రం ఘోర పరాజయం పాలైంది. 403 స్థానాలకు గాను కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.
బీజేపీ మరోసారి భారీ మెజార్టీతో వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టబోతుండడంతో బీఎస్పీ శ్రేణులు తీవ్ర నిరాశానిస్పృహల్లో కూరుకుపోయాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఓటమిపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. ఈ సందర్భంగా మీడియాపై మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియో మొత్తం కులపిచ్చితో ఉందని, యూపీలో బీఎస్పీ ఓటమికి మీడియానే కారణమని ఆమె షాకింగ్ కామెంట్లు చేశారు.
అంబేద్కర్ భావజాలంతో పనిచేస్తున్న బీఎస్పీని కుల పిచ్చితో ఉన్న మీడియా దెబ్బతీసిందని మాయావతి ఆరోపించారు. మీడియా సంస్థల యజమానులకు ఉన్న కుల వివక్ష, విద్వేషాలను ఎవరికీ తెలియకుండా దాచిపెట్టడం సాధ్యం కాదని మాయావతి దుయ్యబట్టారు. బీజేపీకి బీఎస్పీ బీ-టీమ్ అని తప్పుడు ప్రచారం చేసింది మీడియానే అని, దాని వల్ల ముస్లింలు, బీజేపీ వ్యతిరేక ఓటర్లు బీఎస్పీకి దూరమయ్యారని మాయావతి ఫైర్ అయ్యారు. ఆ కారణంతోనే ఇకపై టీవీ డిబేట్లను తమ పార్టీ బహిష్కరిస్తోందని మాయావతి సంచలన ప్రకటన చేశారు.