గత ఐదేళ్ల వైకాపా పాలనలో అన్యాయాలకు అక్రమాలకు అడ్డే లేకుండా పోయింది. జగన్ హయాంలో అన్ని వర్గాల ప్రజలతో పాటు ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకానొక సమయంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై సైతం దాడులు జరిగాయి. అప్పటి సీఎం జగన్ పై టీడీపీ నేత పట్టాభి సీతారాం తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో.. ఆగ్రహానికి గురైన వైసీపీ నేతలు, కార్యకర్తలు 2021లో మంగళగిరి టీడీపీ కార్యాలయం పైకి మూకుమ్మడిగా దండెత్తారు.
కార్యాలయంలోని అద్దాలు, ఫర్నిచర్ సహా వాహనాలను ధ్వంసం చేశారు. టీడీపీ ఆఫీసులోని సిబ్బంది, నేతలపై కూడా వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినప్పటికీ.. వైసీపీ రూలింగ్ కారణంగా పోలీసులు కేసును గట్టిగా పట్టుకోలేకపోయారు. కానీ ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం పై మూడేళ్ల క్రితం జరిగిన దాడి కేసులో పోలీసులు దూకుడు పెంచారు.
దాడి సమయంలో రికార్డైన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఇప్పటికే వైకాపాకు చెందిన పలువురు కార్తకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో నలుగుర్ని మంగళగిరి గ్రామీణ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గుంటూరుకు చెందిన యాషఫ్, విజయవాడకు చెందిన పసుపులేటి ఏసు, వరికూటి నాగిరెడ్డి, మోదుగుల గణపతి అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. దీంతో ఇప్పుటివరకు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 17 మంది పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.