మంచు ఫ్యామిలీ లో చోటు చేసుకున్న విభేదాలు సద్దుమణగక పోగా రోజురోజుకు మరింత ముదురుతున్నాయి. మోహన్‌బాబు, ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ మధ్య చోటుచేసుకున్న వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. వీరి ఇంటి గొడవ పోలీస్ స్టేషన్లు, కోర్టులు వరకు వెళ్లడమే కాకుండా.. జల్పల్లిలో మోహన్ బాబు నివాసం గేట్లను మనోజ్ బద్దలు కొట్టడం, మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడం, ఆ దాడిలో ఓ చానల్ ప్రతినిధికి ఫ్రాక్చర్ అవ్వడం, మరికొందరికి గాయాలు కావడం చకాచకా జరిగిపోయాయి. మంగళవారం జరిగిన ఘర్షణ అనంతరం మోహన్ బాబు ఆరోగ్య సమస్యలతో హస్పటల్ లో చేరారు. ఈ నేపథ్యంలోనే ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.
మంచు విష్ణు మాట్లాడుతూ.. ఇటువంటి పరిస్థితి నా కుటుంబానికి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. మూడు తారాలుగా మోహన్ బాబు గారు ఏంటో మీ అందరికీ తెలుసు. మీడియాపై ఆయనకు ఎంత గౌరవం ఉందో తెలుసు. మాది ఉమ్మడి కుటుంబం. అందరం కలిసి మెలిసి ఉంటామని అనుకున్నాను. కానీ ఇలా జరగడం చాలా బాధాకరం. మా నాన్న చేసిన పెద్ద తప్పు ఏదైనా ఉందా అంటే అది మమ్మల్ని విపరీతంగా ప్రేమంచడమే.
ప్రతి ఇళ్లల్లోనూ గొడవులు ఉంటాయి. త్వరలోనే మా ఇంటి సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాను. కాబట్టి, ఈ విషయాన్ని దయచేసి సెన్సేషన్ చేయొద్దు. మీడియా సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కరెక్టే.. కానీ కొందరు లిమిట్స్ ను పూర్తిగా దాటేస్తున్నారు. నిన్న జరిగిన ఇష్యూలో నాన్నకు గాయాలయ్యాయి. కుటుంబ సమస్య వల్ల అమ్మ ఆసుపత్రి పాలైంది.
కన్నప్ప పోస్ట్ ప్రొడెక్షన్ పనుల్లో బిజీగా ఉన్న నేను విషయం తెలియగానే అన్నీ వదిలేసి అమెరికా నుంచి వచ్చేశాను. అన్నిటికన్నా కుటుంబం చాలా ముఖ్యం. అలాగే నిన్న జరిగిన గొడవలో ఒక టీవీ రిపోర్టర్‌కు గాయాలవ్వడం నిజంగా దురదృష్టకరం. గేట్లు బద్దలుకొట్టి మరీ మనోజ్ లోపలికి వచ్చాడు. నా ప్రకారం ఓ తండ్రిగా మనోజ్‌పై నాన్న అలా రియాక్ట్ అవ్వడం చాలా తక్కువ. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో జరిగిందే కానీ.. ఉద్దేశపూర్వకంగా మేము ఎవరిపైనా దాడి చేయలేదు. సదరు రిపోర్ట్ కుటుంబ సభ్యులతో నేను టచ్ లో ఉన్నాను, వారితో మాట్లాడాను.. వారికి అవసరమైన సాయం చేస్తాము` అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విష్ణు కామెంట్స్ అటు మెయిన్ మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.