మంచు ఫ్యామిలీ వివాదం అనేక మలుపులు తిరుగుతూ మరింత ముదురుతోంది. మంచు మనోజ్ వర్సెస్ మోహన్ బాబు, విష్ణు అన్నట్లుగా పరిస్థితి మారడమే కాకుండా వీరింటి రచ్చ రోడెక్కడం, క్షణికావేశంలో మోహన్ బాబు జర్నలిస్టుపై దాడి చేసి గాయపరచడం, పోలీసులు, కోర్టులు, కేసులు అంటూ నానా హంగామా నడుస్తోంది. రెండు రోజుల క్రితం మంచు విష్ణుపై మనోజ్ మరో ఫిర్యాదు చేశాడు. అమ్మ పుట్టినరోజు అడ్డుపెట్టుకుని విష్ణు తన అనుచరులతో కలిసి నా ఇంట్లోకి వచ్చి గొడవ చేశాడని.. జనరేటర్లో చక్కెర పోయించి విద్యుత్ సరఫరా నిలిపివేయించాడని ఆరోపణలు చేశాడు.
అయితే ఈ పంచదార ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. మనోజ్ మాటల్లో నిజం లేదంటూ తాజాగా అతని తల్లి, మోహన్ బాబు సతీమణి మంచు నిర్మల పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు లేఖ రాశారు. లేఖలో ఏముందంటే.. ` డిసెంబర్ 14న నా పుట్టినరోజు సందర్భంగా జల్పల్లిలోని మా ఇంటికి విష్ణు కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడు. ఆరోజు మనుషులతో వచ్చిన విష్ణు గొడవ చేశాడంటూ మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నాకు తెలిసింది. అందులో నిజం లేదు. విష్ణు ఎటువంటి గొడవ చేయలేదు.
ఇంటికి వచ్చి నాతో కొద్దిసేపు మాట్లాడి.. ఆ తర్వాత తన రూమ్ లో ఉన్న వస్తువులు తీసుకుని వెళ్లిపోయాడు. జల్పల్లిలోని ఈ ఇంటిపై మనోజ్ కు ఎంత హక్కు ఉందో… విష్ణుకు కూడా అంతే హక్కు ఉంది. ఇంట్లో పనివాళ్లను కూడా విష్ణు బలవంతంగా మానిపించలేదు. వాళ్లే ఇక్కడ పని చేయమని మానేశారు` అంటూ నిర్మల లేఖలో పేర్కొన్నారు. అయితే కన్న కొడుకు మనోజ్‌కు వ్యతిరేకంగా, అక్క కొడుకైన విష్ణుకి సపోర్టుగా నిర్మల ఈ లేఖ రాయడం అనేక అనుమానాలకు తెర లేపింది. నిజానికి మనోజ్ సోమవారం మంచు టౌన్ లో లేడు. అత్తగారు భూమా శోభ జయంతి సందర్భంగా భార్య, పిల్లలతో కలిసి మనోజ్ ఆళ్లగడ్డకి వెళ్లారు. మనోజ్ ఇంట్లో లేని సమయంలో నిర్మల చేత విష్ణునో లేక మోహన్ బాబనో బలవంతంగా ఈ లెటర్ రాయించి ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.