వైసీపీ నేత.. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు టీడీపీకి చెందిన మడకశిర ఎమ్మెల్యే కం టీటీడీ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు. తిరుమలపై గతంలో భూమన చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసిన రాజు.. ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమలపై నల్లరాయి తప్ప ఇంకేమీ లేదని.. దాన్ని పెకిలిసతామని మాట్లాడిన భూమన హిందూధర్మం.. టీటీడీ గురించి మాట్లాడటం భక్తుల మనోభావాలు తెబ్బ తీయటమేనని స్పష్టం చేశారు.
గతంలో టీటీడీ ఛైర్మన్ గా వ్యవహరించిన భూమన దేవుడి పేరుతో దోచుకున్నట్లుగా ఆరోపణలు చేశారు. తిరుమల దేవస్థానం బోర్డు ఛైర్మన్ గా వ్యవహరించిన భూమనకు టికెట్లను అడ్డగోలుగా అమ్ముకున్న చరిత్ర.. డాలర్లను మాయం చేసిన అక్రమాలకు పాల్పడ్డారని.. అదే సమయంలో వైవీ సుబ్బారెడ్డి ఛైర్మన్ గా ఉన్నప్పుడు పలు అక్రమాలకు పాల్పడ్డారన్నారు.
తిరుమల పవిత్రతను దెబ్బ తీసేందుకు భూమన కుట్రలు పన్నుతున్నారన్న రాజు.. ‘‘టీటీడీ గోశాలలో 100కు పైగా గోవులు మరణించినట్లుగా అసత్య ప్రచారానికి తెర తీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు టీటీడీ ప్రతిష్ట పెంచేలా చర్యలు తీసుకుంటాం. శుక్రవారం గోశాలను సందర్శించిన భక్తులు.. అక్కడి నిర్వహణపై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గోవుల యోగక్షేమాలు చూసేందుకు 266 మంది పని చేస్తున్నారు. కరుణాకరెడ్డి వస్తే గోవుల జనన.. మరణాలపై లెక్కలు చూపుతాం’ అని వ్యాఖ్యానించారు.
తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ.. ప్రెస్ మీట్ పెట్టిన భూమన.. అనంతరం ప్రెస్ మీట్ వీడియోను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. తిరుమల పవిత్రతను దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేసిన భూమన మీద తిరుమల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తామన్నారు. టీటీడీ గోశాలతో ఆవులు చనిపోయినట్లుగా చెబుతున్న వాదనను నిరూపించిన పక్షంలో తన టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తానని.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. అదే సమయంలో భూమన చేసిన ఆరోపణల్ని నిరూపించలేకపోతే.. రాజకీయ సన్యాసం చేస్తారా? అంటూ సవాలు విసిరారు.దీనికి భూమన రియాక్షన్ ఏమిటో చూడాలి.