టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమ కేసులో అరెస్టు చేసి ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, చంద్రబాబుతో పాటు ఆయనకు మద్దుతుగా నిరసన తెలుపుతున్న వారిపై కూడా జగన్ సర్కార్ కక్ష సాధింపులకు, వేధింపులకు పాల్పడుతోందని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆ వేధింపులు పరాకాష్టకు చేరిన వైనం సంచలనం రేపుతోంది. చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ పాదయాత్ర చేపట్టిన ఓ కార్యకర్తపై వైసీపీ మూకలు దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
నారా భువనేశ్వరిని కలిసేందుకు నంద్యాల నుంచి రాజమండ్రికి పాదయాత్ర చేపట్టిన టీడీపీ కార్యకర్త చింతల నారాయణపై దాడి జరిగింది. పల్నాడు జిల్లా విఠంరాజుపల్లి వద్ద కొందరు దుండగులు వృద్ధుడి అని కూడా చూడకుండా విచక్షణారహితంగా దాడి చేశారు. నారాయణ దగ్గరున్న టీడీపీ జెండాలను లాక్కొని పక్కనపడేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ నారాయణను స్థానిక టీడీపీ నేతలు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రెండు బైక్ లపై నలుగురు వ్యక్తులు తనను వెంబడించి వినుకొండ దాటిన తర్వాత తనపై దాడి చేశారని ఆరోపించారు.
ఈ క్రమంలోనే ఈ ఘటనను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఇది అమానవీయ ఘటన అని, జగన్ సైకోయిజం వైసీపీ కార్యకర్తలకు కూడా అంటుకుందని విమర్శించారు. జగన్ తన శాడిజం చూపిస్తున్నారని, రాజ్యాంగ వ్యవస్థల విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలతోపాటు కార్యకర్తలను, ప్రజలను కూడా హింసిస్తున్నారని విమర్శించారు. వృద్ధుడు అని కూడా చూడకుండా దాడి చేశారని, దాడికి పాల్పడింది ముమ్మాటికీ వైసీపీ సైకోలే అని ఆరోపించారు. జగన్ చూసిన ఫ్యాక్షన్ బాటలో వైసీపీ కేడర్ పయనిస్తూ సామాన్యులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు. నారాయణపై దాడి ఘటనను టీడీపీ సీనియర్ నేత, వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఖండించారు. నారాయణను పరామర్శించారు.