ఏపీలో పోలింగ్, పోలింగ్ తదనంతరం పల్నాడు జిల్లాలో మాచర్ల, దాచేపల్లి, కారంపూడి ప్రాంతాలలో జరిగిన హింస పోలీసులపై సిట్ వేసే స్థాయిలో జరిగిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్ లతో పాటు పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్, తిరుపతి ఎస్పీలతో పాటు పలువురిపై ఈసీ వేటు వేసింది. తాజాగా వారి స్థానాల్లో కొత్తవారిని ఈసీ నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మల్లికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజును ఈసీ నియమించింది.
ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా ఎస్పీగా నియమితులైన మల్లికా గార్గ్ గురించి జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. లేడీ సింగంగా పేరు పొందిన మలికా గార్గ్ పశ్చిమ బెంగాల్ కు చెందిన 2015 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి. రెండున్నరేళ్ల పాటు ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేసిన మల్లికా గార్గ్ ను ఎన్నికలకు నెల రోజుల ముందు తిరుపతి జిల్లా ఎస్పీగా నియమించారు.
అయితే, ముక్కుసూటి అధికారిగా పేరున్న మల్లికా గార్గ్ ను అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ప్రస్తుతం సీఐడీలో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న మల్లికా గార్గ్ ను ఎన్నికల వేళ అత్యంత సమస్యాత్మకంగా నిలిచి పలు హింసాత్మక ఘటనలు జరిగిన పల్నాడు జిల్లాకు ఎస్పీగా ఎన్నికల సంఘం నియమించింది.
ప్రకాశం, తిరుపతి జిల్లాలతో పాటు పల్నాడు జిల్లాకు కూడా మల్లికా గార్గ్ మొదటి మహిళా ఎస్పీ కావడం విశేషం. ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న సమయంలో తప్పు చేసిన హెడ్ కానిస్టేబుళ్ల నుండి ఎస్సై, డీఎస్పీ వంటి అధికారుల వరకు చర్యలు తీసుకున్న మల్లికా గార్గ్ కు లేడీ సింగం అనే పేరుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని అస్సలు సహించని నైజం ఆమెది. ఆమె పేరు చెబితే అవినీతి పోలీస్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవని, వెన్నులో వణుకు పుడుతుందని టాక్. మల్లికా ట్రాక్ రికార్డ్ ను బట్టి, ప్రస్తుతం పల్నాడులో ఉన్న పరిస్థితులు, త్వరలో కౌంటింగ్ వంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పల్నాడు ఎస్పీగా ఆమెను నియమించడం సరైన నిర్ణయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పల్నాడు ఎస్పీగా లేడీ సింగం..వారికి దబిడి దిబిడే! అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.