దేశంలో చాలామంది రాజకీయ పార్టీ అధినేతలు ఉండొచ్చు కానీ.. వారందరికి భిన్నం టీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తనపై ఎవరైనా ఘాటు విమర్శలు చేసినంతనే అందుకు రియాక్ట్ అయ్యే తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. తాజాగా చూస్తే.. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండిని జైలుకు పంపిన నేపథ్యంలో హైదరాబాద్ కు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ‘మతి భ్రమించింది’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. నడ్డా వ్యాఖ్యలకు బదులు చెప్పేందుకు కేసీఆర్ కాకుండా ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టటం.. నడ్డాపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా బీజేపీకి కొత్త అర్థాన్ని తీయటమే కాదు.. నడ్డాను ఉతికి ఆరేసినంత పని చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎం అయ్యిందంటూ నడ్డా ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన మంత్రి కేటీఆర్.. గతంలో కేంద్ర జలశక్తి మంత్రి మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టును కొనియాడటం దేనికి సంకేతం? అని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సిగ్గు లేదని.. ఆయన అబద్ధాలకు అడ్డా.. కేరాఫ్ ఎర్రగడ్డ అని మండిపడిన ఆయన.. ఇంటింటికి నల్లా నీరు ఇచ్చింది దేశంలోనే కేవలం తెలంగాణ మాత్రమేనని కేంద్ర జలశక్తి మంత్రి ప్రశంసించిన విషయం నడ్డాకు తెలీదా? అని నిలదీశారు.
వాస్తవాన్ని చెప్పిన జలశక్తి మంత్రికి మెంటలా? నడ్డాకు మతి భ్రమించిందా? అని ప్రశ్నించారు. బీజేపీలో ఉన్న బండయినా.. గుండైనా.. అరగుండైనా తేడా ఏమీ లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ అంటేనే.. ‘బక్వాజ్ జుమ్లా’ (అసత్య వాగ్దానాలు ఇచ్చే)పార్టీ అంటూ కొత్త అర్థం చెప్పారు. కేసీఆర్ రైతుల ఏటీఎంగా అభివర్ణించారు. రైతు ఉద్యమంలో అన్నదాతల్ని చావగొట్టిన వారు తెలంగాణలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం దారుణమని ధ్వజమెత్తారు.
2022 నాటికి దేశంలోని ప్రతి భారతీయుడికి ఇల్లు.. కరెంటు.. ఉద్యోగం.. ప్రతి ఇంటికి టాయిలెట్ ఇస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసిందని.. ఈ పథకాలన్నీ కనీసం గుజరాత్ లో అయినా అమలు చేశారా? ఇంతటి ఆరాచక.. నిరంకుశ ప్రదానిని దేశం ఎప్పుడూ చూడలేదన్నారు. పంజాబ్ లో ప్రధాని మోడీని రైతులు అడ్డుకుంటే రోడ్డు పైనే ఆయన 20 నిమిషాలు వేచి ఉన్నారని.. ఇలా ఒక ప్రధానిని అడ్డుకోవటం దేశంలోనే తొలిసారని.. ప్రధాని పేరు నరేంద్ర మోడీ కాదని.. కిసాన్ విరోధి అంటూ ఫైర్ అయ్యారు. కేంద్రంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. వాటిని ఎందుకు భర్తీ చేయటం లేదని ప్రశ్నించారు.
ఈడీ నోటీసులు వచ్చాయని ప్రచారం జరుగుతుందని.. మీరేమైనా భయపడ్డారా? అని కేటీఆర్ ను ప్రశ్నిస్తే.. అందుకు కాస్తంత తీవ్రంగా స్పందించారు. బీజేపీ చేసేదే ఆ పని అన్న కేటీఆర్.. ఆ అంశాలకు భయపడేవాడినే అయితే ఈ స్థాయికి వచ్చేవాణ్ని కాదు కదా? అని ఘాటుగా బదులిచ్చారు. కేంద్రం ఉడత ఊపులకు భయపడేదే లేదన్న కేటీఆర్.. నెత్తి మీద బొచ్చు లేని వాడు కూడా మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.