తెలంగాణలో అధికార పార్టీ టిఆర్ఎస్, రాబోయే ఎన్నికల్లో అధికారం కోసం పోరాడుతున్న బిజెపిల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. ఈ క్రమంలోనే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ కు పొగాకు నమిలే అలవాటు ఉందంటూ కేటీఆర్ వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నిర్మల్ లో ర్యాలీ నిర్వహించిన బండి సంజయ్… కేటీఆర్ వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చారు.
ఈ క్రమంలోనే కేటీఆర్ పై బండి సంజయ్ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను ట్విటర్ టిల్లు అని అభివర్ణించిన బండి సంజయ్…ఆ ట్విట్టర్ టిల్ ఒక డ్రగ్ అడిక్ట్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు, బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసుల వ్యవహారంలో ట్విటర్ టిల్లుకు సంబంధం ఉందని, అందుకే ఆ కేసులను మూసివేశారని బండి సంజయ్ ఆరోపించారు. తాను పొగాకు సేవించనని నిరూపించుకునేందుకు ఏ పరీక్షకైనా సిద్ధమని బండి సంజయ్ సవాల్ విసిరారు.
అయితే, అదే తరహాలో డ్రగ్స్ తీసుకోవడం లేదని నిరూపించుకునేందుకు రక్తం, వెంట్రుకల నమూనాలు ఇచ్చేందుకు సిద్ధమా అని పరోక్షంగా కేటీఆర్ ను బండి సంజయ్ ఛాలెంజ్ చేశారు. ఈ నేపథ్యంలో పరోక్షంగా కేటీఆర్ డ్రగ్స్ కు బానిస అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో దుమారం రేపుతున్నాయి. మరి, బండి సంజయ్ వ్యాఖ్యలకు కేటీఆర్ స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.