వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత బోరుగడ్డ అనిల్ ఆఫీసు దగ్ధం ఘటన రాష్ట్ర రాజకీయాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని బండికి కట్టుకొని ఈడ్చుకు పోతానంటూ బోరుగడ్డ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ తర్వాతే గుంటూరులోని బోరుగడ్డ ఆఫీసుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ క్రమంలోనే తన ఆఫీసుకు నిప్పు పెట్టింది కోటంరెడ్డి, టీడీపీ నేతలేనంటూ బోరుగడ్డ ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలోనే ఆ ఆరోపణలపై కోటంరెడ్డి తాజాగా స్పందించారు. అటువంటి ఘాతుకాలకు పాల్పడే సామర్థ్యం తనకు లేదని, అటువంటి ఘటనలతో ఫ్రీ పబ్లిసిటీ తనకు వస్తోందని అన్నారు. ఇంకా, తనకు, తన అనుచరులకు బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయని, వాటికి భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. ఇక, ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు కోసం కేంద్ర హోం శాఖకు లేఖ రాశానని చెప్పారు. అధికారుల అపాయింట్మెంట్ దొరకిన వెంటనే ఫిర్యాదు చేస్తానని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసినందుకే తనపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. అన్నిటికీ తెగించిన వారే తనతో ఉన్నారని, తనపై ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చని చెప్పారు. తాను రాజ్యాంగబద్ధ మార్గాల్లో ప్రజాస్వామ్యయుతంగా పోరాడతానని స్పష్టం చేశారు. నెల్లూరు రూరల్ లో రోడ్లు, వాటర్ వర్క్స్‌పై మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. తన ఆరోపణలకు సరైన రీతిలో స్పందించాలని అన్నారు. పొట్టేపాలెం బ్రిడ్జి వద్ద రోడ్డు సమస్యను సీఎంకు నేరుగా చూపించానని కోటంరెడ్డి వెల్లడించారు. నియోజకవర్గంలో పెండింగ్ పనులు, రోడ్ల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 17న జిల్లా కలెక్టరేట్, 25న ఆర్అండ్బీ శాఖ కార్యాలయం ముందు ధర్నా చేస్తానని ప్రకటించారు.