తెలుగురాష్ట్రాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ లో గణేశుడు కొలువుదీరాడు. ఒగ్గుడోలు, బోనాలెత్తుకున్న మహిళలతో పద్మశాలీ సంఘీయులు ఊరేగింపుగా గణనాధుడు మండపం వద్దకు చేరుకున్నారు. ఈసారి శ్రీసప్తముఖ మహా శక్తి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదగా తొలి పూజ నిర్వహించారు. ఎప్పటిలాగానే స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఖైరతాబాద్ చేరుకున్నారు.
స్పెషాలిటీస్ విషయానికి వస్తే.. ఖైరతాబాద్ లో గణపతి వేడుకలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ సారి 70 అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. మొదటిసారిగా 1954లో అడుగు ఎత్తుతో ఖైరతాబాద్‌లో వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది అడుగు పెంచుతూ వచ్చారు. ఈ ఏడాది గణపతి విగ్రహానికి 7 అంకెను ప్రాధాన్యత ఇచ్చారు.
విగ్రహానికి 7 ముఖాలు ఉండగా.. ఓ వైపు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, మరోవైపు సరస్వతి, మహాలక్ష్మి, పార్వతి, మధ్య గణపతిని తీర్చిదిద్దారు. అలాగే 7 సర్పాలు, రెండు వైపులా 7 చొప్పున మొత్తం 14 చేతులతో విఘ్నేశ్వరుడిని రూపొందించారు. పర్యావరణ హితం కోసం మట్టితోనే వినాయకుడిని సిద్ధం చేశారు. 1000 బ్యాగుల మట్టి, 18 టన్నుల ఇనుము, రెండు వేల మీటర్ల కాటన్ క్లాత్, రెండు వేల మీటర్ల జూట్క్లాత్ ను గణేశుడి కోసం ఉపయోగించారు. 10 రోజుల పాటు మహా గణపతి భక్తుల పూజలు అందుకోనున్నారు. సెప్టెంబర్ 17న అట్టహాసంగా నిమజ్జన వేడుక జరగనుంది.