ఎంత చెప్పినా.. మరెంత మొత్తుకున్నా సరే.. మందుబాబులకు బుద్ధి రావడం, వారి మనసుల్ని మార్చటం అంత తేలిక కాదు. డ్రంకెన్ డ్రైవ్ లు పెట్టి.. భారీగా చలనాలు వసూలు చేసినా.. జైలుశిక్షలు విధించినా.. తాగిన తర్వాత వాహనం నడపొద్దన్న చిన్న విషయంలో వారిని మార్చటం అధికారులకు తలకు మించిన పనిగా మారటం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో మందు బాబులకు విధిస్తున్న శిక్షలు ఎన్నో ఉన్నా.. సత్ఫలితాలు ఇస్తున్నది మాత్రం తక్కువే. ఇలాంటి వేళ.. కేరళలోని మందుబాబులకు అక్కడి పోలీసులు విధించిన శిక్ష ఇప్పుడు వైరల్ గా మారటమే కాదు.. ఇదే పనిని తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులు అమలు చేస్తే ఫలితం ఉంటుందన్న మాట వినిపిస్తోంది.
రాష్ట్రం ఏదైనా రోడ్డు ప్రమాదాలు కామన్ అన్నట్లుగా మారాయి. అయితే.. ఈ రోడ్డు ప్రమాదాల్లో చాలావరకు వాహనదారుల నిర్లక్ష్యంతో పాటు.. క్రమశిక్షణ లేకపోవటం కూడా కారణం. అలాంటిదే కొచ్చిలో చోటు చేసుకున్న ఒక ప్రైవేటు బస్సు ఢీ కొన్న ఘటనలో టూవీలర్ నడుపుతున్న వ్యక్తి ఒకరు మరణించారు. ఈ ఉదంతంపై కేరళ హైకోర్టు స్పందిస్తూ.. ట్రాఫిక్ ఉల్లంఘనుల విషయంలో కఠినంగా శిక్షలు వేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
న్యాయస్థానం చేసిన సూచనను అమలు చేసేందుకు కొచ్చి పోలీసులు సరికొత్త ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా తాజాగా నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ లో పెద్ద ఎత్తున మందు బాబులు దొరికారు. వారికి రోటీన్ కు భిన్నంగా శిక్ష వేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అదేమంటే.. తాగి నడిపిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి చేత.. ‘‘ఇకపై తాగి డ్రైవింగ్ చేయను’’ అని వారితో వెయ్యిసార్లు రాయించిన తర్వాత వదిలేశారు. ఇదే పద్దతిని.. వెయ్యి కాకుండా పది వేల సార్లకు చేస్తే.. మందు గ్లాస్ పట్టుకున్నంతనే చేతులకు ఇంపోజిషన్ శిక్ష గుర్తుకు వచ్చి వణికేలా చేయాల్సిన అవసరం ఉంది. సింఫుల్ గా కనిపించే ఈ పనిష్ మెంట్ కు ఫలితం ఎక్కువగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. మరి.. తెలుగు రాష్ట్రాల పోలీసులు ఈ పనిష్ మెంట్ ను అమలు చేస్తారా? దీనికి మించినదేదో ఆలోచిస్తారా? అన్నది చూడాలి.