తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన కేసీఆర్… బీఆర్ఎస్ తో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే పొరుగు రాష్ట్రం అయిన ఏపీపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముందుగా కర్ణాటక, మహారాష్ట్రలోనే బీఆర్ఎస్ కార్యకలాపాలు మొదలవుతాయని చెప్పిన కేసీఆర్…ఏపీపై కూడా ఫోకస్ పెట్టారు.
ఏపీకి చెందిన కొందరు టీడీపీ, ఇతర పార్టీల నేతలతో ఆయన టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో టీడీపీ తరఫున మంత్రిగా పనిచేసిన కేసీఆర్…ఆ సమయంలో ఉన్న పరిచయాలను ఉపయోగించుకొని ఏపీలోని కొందరు టీడీపీ నేతలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. కొందరు టీడీపీ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతో కేసీఆర్ టచ్ లోకి వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. గతంలో టీడీపీలో ఉన్న సమయంలో తనతో సన్నిహితంగా ఉన్న నేతలను కేసీఆర్ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారట. ఈ విషయాన్ని పరోక్షంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు.
ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాలపై ఫోకస్ చేసిన కేసీఆర్ బీఆర్ఎస్ లో చేరాలని పలువురు టీడీపీ నేతలకు ఆహ్వానం అందించారట. ఇక, గత ఎన్నికల్లో లోక్ సభ బరిలో దిగి ఓటమి పాలై, ప్రస్తుతం రాజకీయాలకు కొంతదూరంగా ఉంటున్న నేతలను కూడా కేసీఆర్ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. మాజీ ఎంపీ, సీనియర్ పొలిటిషన్ ఉండవల్లి అరుణ్ కుమార్ తో కూడా కేసీఆర్ గతంలో సుదీర్ఘ చర్చలు జరిపారని ఎర్రబెల్లి తెలిపారు.
దీంతో, ఉండవల్లి కూడా బీఆర్ఎస్ లో చేరే అవకాశాలున్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే, ఏపీపై గతంలో విద్వేష వ్యాఖ్యలు చేసిన కేసీఆర్… ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో రాష్ట్రంలోకి వచ్చి రాజకీయాలు చేస్తానంటే ప్రజలు అంత సులువుగా నమ్మే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందులోనూ, వైసీపీ, టీడీపీల మధ్య ద్విముఖ పోరుకు మాత్రమే ఏపీలో అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ కు పొలిటికల్ స్పేస్ లేదని టాక్ వస్తోంది. మరి, కేసీఆర్ ఇచ్చిన ఆఫర్ ను టీడీపీ నేతలు స్వీకరిస్తారా లేదా అన్నది తెలియాలంటే మరికొంత కాలం చేసి చూడక తప్పదు.