సుదీర్ఘ స్వప్నం సాకారమైన రోజు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇవాల్టికి ఏడేళ్లు గడిచాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని సాదాసీదాగా నిర్వహిస్తున్నారు. మామూలుగా అయితే.. ఇవాల్టి రోజున ధూంధాంగా చేసే పరిస్థితి. అందుకు భిన్నంగా పెద్ద పెద్ద కార్యక్రమాల్ని నిర్వహించకుండా సింఫుల్ గా వేడుకల్ని పూర్తి చేస్తున్న పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్ని వీలైనంతవరకు నిర్వహించారు.
ఎప్పటిలానే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్ని తెలంగాణ అధికారపక్షం టీఆర్ఎస్ తమదే విజయమన్నట్లుగా నిర్వహిస్తే.. తెలంగాణ రావటంలో కీలకభూమిక పోషించిన కాంగ్రెస్.. తమ స్టేక్ కోసం కిందా మీదా పడే పరిస్థితి. తెలంగాణ కల సాకారంలో తమ వంతుగా బీజేపీ చేసిన సాయాన్ని చెప్పుకోవటంలో అప్పుడు ఇప్పుడు పెద్దగా సక్సెస్ కాకపోవటం తెలిసిందే. అదే రీతిలో ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని నిర్వహించారంటే నిర్వహించామన్నట్లుగా ఉంది వారి వ్యవహారం.
ప్రధాన పార్టీల పరిస్థితి ఇలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం తరఫున నిర్వహించిన కార్యక్రమాల్లో ఒక కీలకమైన అంశాన్ని తెలంగాణ వాదులు అదే పనిగా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్ర రూపశిల్పి.. వ్యూహకర్త ప్రొఫెసర్ జయశంకర్ మాష్టారి ఫోటో కనిపించటాన్ని లోటుగా అభివర్ణిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రొఫెసర్ సాబ్ కు ప్రాధాన్యత లభించకపోవటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. పోరాడి సాధించుకున్న సొంత రాష్ట్రంలో.. రాష్ట్ర కలను సజీవంగా ఉంచి.. కేసీఆర్ లాంటి నేతను తయారు చేసిన జయశంకర్ మాష్టారి ఫోటో లేకపోవటం ఏమిటన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైన గన్ పార్కు దగ్గర కూడా గాంధీ ఫోటోను పెట్టారే కానీ.. జయశంకర్ మాష్టారి ఫోటో కనిపించకపోవటాన్ని తప్పు పడుతున్నారు. తన గురువుగా.. తెలంగాణ సాధన కోసం.. అందుకు అనుసరించాల్సిన విధానం గురించి.. ఉద్యమం ఎలా చేయాలన్న దానిపైనా ఏళ్ల తరబడి చర్చించుకునే వాళ్లమని కేసీఆరే చెప్పుకున్న పరిస్థితి. అలాంటి సిద్ధాంతకర్తను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం మర్చిపోవటం ఏమిటి?