ఏపీలో అధికార వైఎస్సార్సీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తిరుపతి ఉప ఎన్నికకు ముందే ఆ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు మాత్రమే కాదు ఏకంగా 3 – 4 లక్షల మెజార్టీ టార్గెట్‌తో పని చేయాలని సీఎం జగన్ ఆదేశించగా… కీలక నేతలు అసంతృప్తితో ఉండడం ఇప్పటికే పార్టీకి ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గానికి చెందిన పార్టీ కీలక నేత, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కనుమూరు హరిచంద్రారెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల కొంత కాలంగా పార్టీలో జరుగుతున్న వరుస పరిణామాలతో బాధకలిగించినట్లు చెప్పారు.
తాను పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నానని.. అయితే తనపై లేనిపోని అసత్య ప్రచారం, ఆరోపణలు చేస్తున్నారని.. ఈ పరిణామాలతో తాను ఎంతో ఆవేదన చెందానని హరిచంద్రారెడ్డి చెప్పారు. ఇక తాను రాజకీయాలకు సరిపోనేమోనన్న సందేహం కూడా ఆయన వ్యక్తం చేశారు. పొరపాటుగా ఈ రంగంలోకి వచ్చానని చెప్పిన ఆయన వైఎస్సార్సీపీలో చేరినప్పటి నుంచి నేటి వరకు తనకు సహకరించిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. తాను ఈ రంగంలో ఉండలేననే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు.
ఇటీవల గూడూరు నియోజకవర్గంలో అధికార పార్టీలోనే గ్రూపు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. పలువురు నేతలు ఎమ్మెల్యే వెలగలపల్లి వరప్రసాద్‌కు వ్యతిరేకంగా రోడ్డు కెక్కేసి నానా రచ్చ చేస్తున్నారు. వరప్రసాద్‌పై సొంత పార్టీ కేడర్లోనే తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ క్రమంలోనే చాలా మంది పార్టీ నేతలు సరైన టైం కోసం వేచి చూస్తున్నారు. ఇక పార్టీలో ఉండేలని వారు ఉప ఎన్నికల్లో తమ దెబ్బేంటో చూపియాలన్న కసితో ఉన్నారు. ఈ క్రమంలోనే హరిశ్చంద్రారెడ్డి లాంటి నేతలకు బయటకు వస్తున్నారు.
ఇక పార్టీకి రాజీనామా చేసిన కనుమూరు హరిచంద్రారెడ్డి తన వల్ల గూడూరు ప్రజలకు ఏదైనా తప్పు జరిగితే క్షమించాలని చెప్పడంతో పాటు తాను పార్టీ వీడినా తన ట్రస్ట్ ద్వారా ప్రజలకు ఎప్పుడూ సాయం చేస్తానని చెప్పారు. స్థానికంగా పట్టున్న ఆయన తిరుపతి ఉప ఎన్నికల వేళ పార్టీని వీడడంతో జిల్లా వైసీపీ వర్గాలు షాక్ తిన్నాయి. ఆయన్ను బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నా అవి ఎంత వరకు ఫలిస్తాయో ? చెప్పలేని పరిస్థితి.