టాలీవుడ్లో పెద్ద కుటుంబాల్లో ఒకటైన మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం.. కన్నప్ప. టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్‌లో ఒకటైన ‘భక్త కన్నప్ప’ను నేటి తరానికి అందించాలని మోహన్ బాబు, విష్ణు ఎన్నో ఏళ్ల నుంచి కలలు కంటూ వచ్చారు. ఎట్టకేలకు గత ఏడాది ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. విష్ణునే తన టీంతో కలిసి ఈ సినిమా స్క్రిప్టు రూపొందించగా.. బాలీవుడ్ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ చిత్రం గత ఏడాది డిసెంబరులోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కుదరక ఈ ఏడాది వేసవికి వాయిదా వేశారు. ఏప్రిల్ 25కు రిలీజ్ డేట్ ఖరారు చేసి.. జోరుగా ప్రమోషన్లు చేశారు కానీ, ఆ డేట్‌ను కూడా అందుకోలేకపోయింది చిత్ర బృందం. ఈ మధ్యే సినిమాను వాయిదా వేస్తున్నట్లు విష్ణు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఐతే మరీ ఆలస్యం చేయకుండా కొత్త డేట్‌ను చిత్ర బృందం ఖరారు చేసింది. జూన్ 27న ‘కన్నప్ప’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా కన్నప్ప టీం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌ను కలిసింది. అనంతరం సినిమా రిలీజ్ డేట్‌ను మీడియాతో పంచుకుంది. విశేషం ఏంటంటే గత ఏడాది ప్రభాస్ నటించిన ‘కల్కి’ జూన్ 27నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇప్పుడు ప్రభాస్ ప్రత్యేక పాత్ర చేసిన ‘కన్నప్ప’ సైతం అదే డేట్‌కు రానుంది. సెంటిమెంట్‌తోనే ఈ డేట్‌ను ఎంచుకుని ఉండొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో ఆలస్యం వల్లే ‘కన్నప్ప’ మరోసారి వాయిదా పడింది. ఈ చిత్రంపై రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టింది మోహన్ బాబు కుటుంబం. ఇందులో విష్ణు కన్నప్ప పాత్ర చేయగా.. అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా కనిపించనున్నారు. ప్రభాస్ రుద్ర అనే రోల్లో కనిపించనున్నాడు.