టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదరడంతో జనసేన, బీజేపీల నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల విషయంలోనూ అంచనాలు వెలువడుతున్నాయి.
జనసేన, బీజేపీలు కలిసి 8 లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తాయంటున్న నేపథ్యంలో ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి పోటీ చేస్తారనే లీకులు జనసేన, బీజేపీల నుంచి వస్తున్నాయి.
మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా లోక్ సభకు పోటీ చేస్తారని తెలుస్తోంది. ఆయన అసెంబ్లీ, లోక్ సభ రెండు స్థానాలకూ పోటీ చేస్తారని పార్టీ వర్గాల నుంచి విశ్వసనీయమైన సమాచారం.
పవన్ కల్యాణ్ కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీకి చెందిన కీలక నాయకుడు ఒకరు ‘నమస్తే ఆంధ్ర’కు చెప్పారు.
అమిత్ షాతో చర్చ సమయంలోనూ ఆయన ప్రత్యేకించి పవన్ కల్యాణ్‌ను ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారని అడిగారని.. అమిత్ షా కూడా పవన్ లోక్ సభకు రావాలని కోరుకున్నారని సమాచారం.
కాగా జనసేన, బీజేపీల నుంచి పోటీ చేస్తున్న మిగతా స్థానాలు, అభ్యర్థుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
మచిలీ పట్నంలో వల్లభనేని బాలశౌరి జన సేన నుంచి పోటీ చేయనున్నారని… రాజంపేట నుంచి బీజేపీ తరఫున కిరణ్ కుమార్ రెడ్డి, రాజమండ్రిలో బీజేపీ నుంచి పురందరేశ్వరి, ఏలూరు నుంచి సుజనా చౌదరి, నరసాపురం నుంచి రఘురామ కృష్ణరాజు, అనకాపల్లి నుంచి సీఎం రమేశ్ బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తారని తెలుస్తోంది.
ఇక బీజేపీ పోటీ చేయబోయే మర్ నియోజకవర్గం హిందూపురం కావొచ్చని సమాచారం. హిందూపురం కాకుండా అరకు లోక్ సభ నియోజకవర్గం నుంచి కూడా బీజేపీ పోటీ చేసే అవకాశాలున్నాయి.