రాష్ట్రం ఏదైనా కావొచ్చు.. ప్రభుత్వాలు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలని పిల్లాడ్ని అడిగినా.. కరోనా వైద్యానికి.. వ్యాక్సినేషన్ కు అని చెబుతారు. అందరిది ఒక దారి అయితే.. జగనన్నది మరో దారి అన్నట్లుగా ఆయన తీరు ఉంది. ఒకపక్క పట్టపగ్గాల్లేకుండా దూసుకెళుతున్న పంచ కల్యాణి మాదిరి కరోనా కేసులు రాష్ట్రంలో పరుగులు తీస్తుంటే.. ఇప్పటికి పాఠశాలల్ని నిర్వహించే (మంగళవారం నుంచి బడులకు ఇవాళే సెలవులు ప్రకటించారనుకోండి) సిత్రం జగన్ సర్కారుకే చెల్లుతుంది.
అంతేనా.. కరోనా బారిన పడి.. ఆసుపత్రుల్లో బెడ్డు దొరక్క నానా అవస్థలు పడుతున్న వారు ఒకవైపు.. ఆక్సిజన్ నిండుకొని మరికొందరు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. రెమెడెసివర్ లాంటి మందుల కోసం వేరే రాష్ట్రాలకు కార్లు వేసుకొని మరీ వెళుతున్న ఉదంతాలు మరెన్నో. ఇలాంటి వేళ.. ప్రజలకు అవసరమైన వైద్య సాయం మీద ఫోకస్ పెట్టాల్సిన జగన్ సర్కారు.. జగనన్న విద్యా దీవెన పథకం మీద భారీ ఎత్తున ప్రచారం చేసుకోవటం ఏమిటి?రాష్ట్రంలో ఏం జరిగినా.. కరోనా ఎంతలా చెలరేగిపోయినా.. షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వం చేసుకునే ప్రచారంలో మాత్రం మార్పు ఉండదా? అన్న సందేహం కలుగక మానదు.
ఈ రోజున ఏపీ పత్రికలకు ఇచ్చిన భారీ యాడ్లు చూస్తే.. నోట మాట రాక మానదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య పరిస్థితి మీద ఫోకస్ పెట్టాల్సిన ప్రభుత్వం.. అందుకు భిన్నంగా.. విద్యా దీవెన పథకాలకు ప్రచారం చేసుకోవటం ఏమిటి? అనుకుంటాం కానీ.. ప్రజలేం కోరుకుంటాయో ప్రభుత్వాలు అవే ఇస్తాయని.. ఏపీని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు.