ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సలహాదారుల పదవీ కాలాన్ని ప్రభుత్వం మరోసారి పొడిగింది. ప్రస్తుతం ప్రభుత్వానికి రాజకీయ సలహాదారుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి పదవీ కాలం ఏడాదిపాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సజ్జలతో పాటు ప్రభుత్వ సలహాదారు(కమ్యూనికేషన్)గా ఉన్న జీవీడీ కృష్ణ మోహన్ పదవి కాలాన్ని మరో ఏడాది పొడిగించారు. అంతేకాదు ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సలహాదారు అజయ్ కల్లం, ప్రభుత్వ సలహాదారు శామ్యూల్ పదవీకాలాలను కూడా సర్కారు మరో ఏడాది పొడిగిస్తూ.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఆది నుంచి విమర్శలే..
వాస్తవానికి రాష్ట్రంలో మంత్రుల కంటే సలహాదారుల సంఖ్యే ఎక్కువనే విమర్శలు ఉన్నాయి. గతంలో ఏ ప్రభుత్వంలోనూ లేని విధంగా సీఎం జగన్ కేబినెట్ సంఖ్య 25 అయితే.. దీనికి ఒకటిన్నర రెట్లు అంటే 33 మందిని సలహాదారులుగా నియమించుకు న్నారు. వీరిలో ఒక్కొక్కరికి నెలకు రూ.3 లక్షల జీతంతో పాటు ప్రతి నెలా రెండు లక్షల అలవెన్సులు ఇస్తున్నారు. ఇవి కాకుండా ఆఫీస్, కారు, డ్రైవర్, పి.ఎస్ వంటి సదుపాయాలు అదనంగా ఉన్నాయి. సజ్జల సహా ఐదారుగురు సలహాదారులకు క్యాబినెట్ ర్యాంక్ తో పాటు ప్రోటోకాల్ అదనంగా ఉంది.
నిజానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సలహాదారులను మరోసారి రెన్యువల్ చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల రాజకీయంగా అవకాశం దక్కనివారు, పార్టీకి సేవ చేసినా పదవులు రానివారు, రాజకీయంగా, సంస్థాగతం, వ్యక్తిగతంగా సీఎం జగన్ కు సహకరించిన వారు, ఆబ్లిగేషన్స్ ఉన్నవారిని ప్రభుత్వంలో సలహాదారులగా నియమించారు. ఇన్ని ఆరోపణలు, విమర్శలు వస్తున్నా ప్రభుత్వం మాత్రం సలహాదారులను కొనసాగించడమే కాకుండా.. వారిని మరో ఏడాది పాటు రెన్యువల్ చేస్తూ.. ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ఇంత మందిని పెట్టుకుని కూడా..
ఇంతమంది సలహాదారులు ఉన్నప్పటికీ సర్కారుకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మళ్ళీ ప్రశాంత్ కిశోర్(పీకే) టీమ్ ని రంగంలోకి దించక తప్పని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు అనగానే ప్రశాంత్ కిశోర్ టీమ్ సర్వే నిర్వహించి ఏ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి, ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి,ఎవరిని పదవి నుండి తప్పించాలి వంటి సలహాలు ఇచ్చింది. కొన్ని కీలక అంశాల్లో తమను సంప్రదించకపోవడం, తమకు తెలియకుండానే నిర్ణయాలు తీసుకోవడంతో కొందరు సలహాదారులు రాజీనామా చేసి వెళ్లిపోయారు.
నెలనెలా కోట్లలో ఖర్ఛు పెట్టి సలహాదారులను నియమించుకుంటే వారిచ్చే సలహాలు పార్టీకి, ప్రభుత్వానికి ఉపయోగపడకపోగా చెడ్డపేరు తెచ్చేలా ఉంటున్నాయని, పైగా 33 మంది సలహాదారులలో కేబినెట్ ర్యాంక్ ఉన్న, సాగి దుర్గా ప్రసాదరాజు, తలశిల రఘురాం, జీవీడీ కృష్ణమోహన్, దేవులపల్లి అమర్, పీటర్ హాసన్, ఎం. శామ్యూల్ వంటి వారి పాత్ర నామనాత్రంగానే ఉంది తప్ప ప్రభుత్వానికి, పార్టీకి ఉపయోగపడటంలేదనే భావన వ్యక్తమవుతోంది. ఇలాంటి సమయంలో మరోసారి.. సలహాదారుల పదవులను రెన్యువల్ చేయడంపై వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.