టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై కక్ష సాధించేందుకే జగన్ ఆయనను అరెస్ట్ చేయించారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ కు నిరసన తెలుపుతూ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు పలువురు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు అరెస్టుపై జగన్ తొలిసారి స్పందించారు. చంద్రబాబు ఆధారాలతో సహా పట్టుబడ్డారని, ఆ క్రమంలోనే అరెస్టు చేసి జైలుకు పంపించారని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయినా సరే చంద్రబాబును కాపాడుకునేందుకు కొందరు సిద్ధమయ్యారని విమర్శించారు. చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పేవారు ఇంతకాలం లేరని అన్నారు. మామూలు వ్యక్తి నేరం చేసినా, ఎవరు నేరం చేసినా చట్ట ప్రకారం శిక్ష పడుతుందని ఇప్పుడు తెలిసిందని చెప్పారు. అయితే, చంద్రబాబు మద్దతుదారులు ఈ విషయాన్ని తట్టుకోలేకపోతున్నారని అన్నారు. ఇంత అడ్డగోలుగా బాహాటంగా దొరికిపోయినా…ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అన్న వాడు ప్రశ్నించడం లేదని పవన్ కళ్యాణ్ పై జగన్ సెటైర్లు వేశారు. ఆయన చేసిన పనులు సబబేనని చంద్రబాబు మద్దతుదారులు అంటున్నారని విమర్శించారు. అయితే, ఎటువైపు నిలబడాలో ప్రజలు నిర్ణయించుకోవాలని జగన్ అన్నారు.
ఈ క్రమంలోనే జగన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. చట్టం ఎవరికైనా ఒకటే అని బల్లగుద్ది చెప్తున్న జగన్… బాబాయ్ మర్డర్ కేసులో అవినాష్ రెడ్డిని కాపాడేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు కర్నూలులో అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులు వచ్చిన సందర్భంగా వాహనాలు అడ్డుపెట్టి సీబీఐ అధికారులను వైసీపీ శ్రేణులు ఎందుకు అడ్డుకున్నాయో చెప్పాలని నిలదీస్తున్నారు. చంద్రబాబు మాదిరిగానే అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయించి ఆయన నిజాయితీని నిరూపించుకోమని చెప్పాల్సింది కదా అంటూ చురకలంటిస్తున్నారు.