స్కూల్ కు వెళ్లే పిల్లలు డుమ్మా కొట్టేందుకు రకరకాల కారణాలు వెతుకుతుండడం చూసి తల్లిదండ్రులు, టీచర్లు నవ్వుకుంటుంటారు. కడుపు నొప్పి మొదలు కాలు నొప్పి అంటూ కుంటి సాకులు చెబుతూ ఉంటారు. ఈ వ్యవహారం చిన్న పిల్లల వరకు బాగానే ఉంటుంది. అయితే, అసెంబ్లీకి వెళ్లి తమ సమస్యలు పరిష్కరిస్తారని భావించి ఓటేసిన ఎమ్మెల్యేలు కూడా బడి పిల్లల మాదిరి కుంటి సాకులు వెతుకుతుంటే ఛెండాలంగా ఉంటుంది. అసెంబ్లీకి వెళ్లి అధికార పక్షాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక కల్లబొల్ల కబుర్లు చెబుతూ శాసన సభకు వెళ్లకపోతే కామెడీగా ఉంటుంది. కానీ, వైసీపీ అధినేత జగన్ మాత్రం జబర్దస్త్ కామెడీ అయినా చేస్తానుగానీ అసెంబ్లీకి మాత్రం వెళ్లను అంటున్నారు.
అసెంబ్లీలో 11 మంది ఎమ్మెల్యేలతో వెళ్లి 161 మంది ఎమ్మెల్యేల చేతిలో ర్యాగింగ్ తట్టుకోలేనని కొత్త కొత్త కుంటిసాకులు వెతుకుతున్నారు జగన్. కొత్త ప్రభుత్వంలో తొలి అసెంబ్లీ సమావేశాలు బాయ్ కాట్ చేసి ఢిల్లీలో ధర్నా అంటూ డ్రామా చేసిన జగన్..ఈ సారి మరో కొత్త సాకు వెతుక్కున్నారు. బహుశా దేశ చరిత్రలో మరెవరూ చేయని విధంగా మీడియా ముందు అసెంబ్లీ సమావేశాలు తనకు తానే నిర్వహించుకుంటానని జగన్ ప్రకటించిన వైనం షాకింగ్ గా మారింది.
‘‘అసెంబ్లీలో సమావేశాలకు వెళ్లినా ఉపయోగం లేదు..వైసీపీ సభ్యులకు స్పీకర్ మైక్ ఇవ్వడం లేదు…కాబట్టి మీడియా ప్రతినిధులే నా స్పీకర్లు, ఇకపై అసెంబ్లీ సమావేశాలు జరిగిన ప్రతిసారి మీడియా సమక్షంలోనే ప్రతిపక్ష పార్టీగా మారి ప్రజా సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా…’’ పులివెందుల ఎమ్మెల్యే, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కకపోయినా సెల్ఫ్ మేడ్ ప్రతిపక్ష నేత జగన్ చెప్పిన డైలాగులు.
ప్రస్తుతం జగన్ డైలాగులు మీమర్స్ కు, ట్రోలర్స్ కు కావాల్సినంత మెటీరియల్ అయ్యాయి. మీడియా ముందు అసెంబ్లీ పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్న జగన్ ఐడియా ఎందరో జీవితాలను మార్చేస్తుందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇంత మాత్రం దానికి ఎన్నికల్లో పోటీ చేయడం దేనికని,, ఎంచక్కా అసెంబ్లీ జరిగే ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నిస్తే సరిపోతుందని చురకలంటిస్తున్నారు. అధికార పక్షాన్ని సభలో ప్రశ్నించే హక్కు ఎమ్మెల్యేలకు మాత్రమే ఉంటుందని, అందుకే కష్టపడి ప్రజల మెప్పు పొంది వారి తరఫున అసెంబ్లీలో అడుగుపెడతారని వారు కామెంట్లు చేస్తున్నారు. జగన్ సెట్ చేసిన ట్రెండ్ కొత్తగా కాదు చెత్తగా ఉందని విమర్శిస్తున్నారు. అసెంబ్లీ ఎగ్గొట్టేందుకు జగన్ కొత్త డ్రామా..నభూతో నభవిష్యత్ అని ట్రోల్ చేస్తున్నారు.