దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమితంగా అభిమానించి.. ప్రేమించే సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. గుండెపోటుతో మరణించినట్లుగా కవరింగ్ ఇవ్వటం.. హత్యను కప్పి పుచ్చేందుకు జరిగిన ప్రయత్నాలు. ఒక్కొక్కటిగాబయటకు వచ్చిన వివరాలతో ఈ హత్య కేసు ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. ఈ హత్య జరిగిన సమయంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఉండటం.. అయినప్పటికీ వివేకా హత్యలో నాటి అధికార పార్టీ హస్తం ఉందన్న ఆరోపణలతో చంద్రబాబు సర్కారు గజగజలాడిపోవటం తెలిసిందే. నిజానికి వివేకా హత్యను ఆయుధంగా వాడుకున్నట్లైయితే పరిస్థితులు ఎలాఉన్నా.. నిఘా వర్గాలను యాక్టివ్ చేయటంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారని చెబుతారు.
కట్ చేస్తే.. వైఎస్ వివేకా హత్య ఎపిసోడ్ లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పేరు ఉండటం.. ఈ మధ్యనే అతన్ని సీబీఐ అధికారులు విచారణ జరపటం తెలిసిందే. పలు ప్రశ్నలను ఎదుర్కొన్న అవినాశ్ రెడ్డి.. తన మీద వచ్చిన ఆరోపణల్ని సింఫుల్ గా తీసి పారేయటం తెలిసిందే. అయితే.. అవినాశ్ రెడ్డి కాల్ డేటాను చూసినప్పుడు.. హత్య జరిగిన వేళలో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి.. ఆయన సతీమణి వద్ద సహాయకులుగా పని చేసే వారి ఫోన్లకు పెద్ద ఎత్తున ఫోన్లు చేసిన వైనాన్ని సీబీఐ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు.
ఈ క్రమంలో జగన్ వద్ద ఒఎస్టీగా పని చేసిన వ్యక్తితో పాటు.. వైఎస్ భారతికి వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించే వ్యక్తి ఫోన్ కు పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ రావటం తెలిసిందే. ఇదే విషయాన్ని తాజాగా జరిగిన విచారణలోనూ సీబీఐ అధికారులు వారిని ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వారి నుంచి పొందిన సమాచారాన్ని అనుసరించి.. సీబీఐ విచారణ తదుపరి గమనం ఉంటుందని తెలుస్తోంది.
తాజాగా సీబీఐ అధికారుల వద్ద ఉన్న సమాచారం భారీగా ఉండటమే కాదు.. హత్య సమయానికి అవినాశ్ రెడ్డి చేసిన ఫోన్ కాల్స్ .. వాటి వివరాలు.. ఆ కాల్ లో ఆయన మాట్లాడింది ఎవరితో? ఏమేం డిస్కషన్ చేశారన్న అంశాలు.. రానున్న రోజుల్లో ఏపీలోని కీలక నేత కుటుంబానికి కూడా సీబీఐ నోటీసులు తప్పవన్న మాట వినిపిస్తోంది. దీనికి కారణం.. ఎంపీ అవినాశ్ రెడ్డికి వివేకా హత్య కేసులో అతడి పాత్రకు సంబంధించిన అంశాల్ని తేల్చాల్సి వచ్చినప్పుడు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరపాల్సి ఉంటుంది. ఆ క్రమంలో కీలక నేత… వారి కుటుంబం కూడా సీబీఐ ఎదుట వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది.