“నా అక్కచెల్లెమ్మలకు.. నేను ఒక్కటే చెప్తావున్నా! చంద్రబాబుకు మనసుంటే.. అన్నీ ఎప్పుడో చేసేవాడు. కడప స్టీల్ ప్లాంటు, పోలవరం వరద బాధితులకు పరిహారం వంటివి ఎప్పుడో ప్రకటించేవాడు. కానీ, ఎన్నికలకు ఆరు మాసాల ముందు.. వాటిని చేపడుతున్నాడు. అంటే.. ఇది ప్రజలను మోసం చేయడం కాదా! అని నేనడుగుతున్నా!. మరో ఆరు మాసాల్లో ఎన్నికలు. ఇప్పుడు చంద్రబాబు కడప స్టీల్ ప్లాంటుకు శంకుస్థాపన చేశాడు. ఈ ఆరు నెల్లలో ఆయన ఏం చేస్తాడు? పచ్చి దగా కాదా?. ఏం చేయాలన్నా.. ఎన్నికలకు ఆరు మాసాల ముందుగానే చేయాలి. అదీ చిత్త శుద్ధి!“- 2019 ఎన్నికలకు ముందు సీఎం జగన్ పాదయాత్రలో చేసిన వ్యాఖ్యలు ఇవి!!
ఈ వ్యాఖ్యలను దాదాపు ఐదేళ్లు అయిపోయాయి కాబట్టి ఆయన మరిచిపోయి ఉండొచ్చు. కానీ, ఏపీ ప్రజలు మాత్రం ఇంకా గుర్తు పెట్టుకున్నారు. ముఖ్యంగా విజ్ఞులు, మేధావులు, పరిశీలకులు ఇంకా బాగా గుర్తు పెట్టుకున్నారు. ఇప్పుడు అవే వ్యాఖ్యలను వారు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే.. అదే జగన్.. అప్పట్లో చంద్రబాబును తప్పుబట్టిన జగన్.. ఇప్పుడు అదే పనిచేస్తున్నారు కాబట్టి! అవును. అప్పట్లో చంద్రబాబు ఎన్నికలకు ఆరు మాసాల ముందు కొన్ని నిర్ణయాలు తీసుకుంటే తప్పని.. ముక్తాయించిన జగన్.. ఇప్పుడు ఎన్నికలకు కేవలం 5 మాసాల ముందుగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. మరి వీటిని మోసం అనరా? అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. గత `ఆరు నెలల మోసం` మాటలను మరిచిపోయారా జగన్? అని నిలదీస్తున్నారు.
తాజాగా సీఎం జగన్ రాష్ట్రంలో ఎన్నికలను ప్రభావితం చేసేలా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని పరిశీలకులు చెబుతున్నారు. దీనిలో ప్రధానంగా కుల గణన, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ, ప్రజలందరికీ వైద్య పరీక్షలు, కంటి ఆపరేషన్లు, కళ్ల జోళ్ల పంపిణీ సహా దాదాపు 19 వేల కోట్ల రూపాయల విలువైన కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు వంటివి ఉన్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఎన్నికలకు ముందు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే తప్పుబట్టిన జగన్.. ఇప్పుడు ఇలా చేయొచ్చా అనేది ప్రశ్న. మరి దీనిపై వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.