జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కన్ఫ్యూజన్ ఉందా ? లేకపోతే మొండిగా వ్యవహరిస్తోందా అన్నదే అర్ధం కావటంలేదు. ఒకవైపు కరోనా వైరస్ సెకెండ్ వేవ్ భయంకరంగా భయపెడుతోంది. రోజుకు 20 వేల కేసులు నమోదవుతున్నాయి. అయినా 10వ తరగతి పరీక్షలను వాయిదా లేదా రద్దు చేయటంలో మీనమేషాలు లెక్కిస్తోంది. కరోనా వైరస్ కారణంగానే ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేసిన ప్రభుత్వం 10వ తరగతి పరీక్షల విషయంలో మాత్రం ఎందుకింత మొండిపట్టుదలకు పోతోందో అర్ధం కావటంలేదు.
ఇంటర్ పరీక్షల విషయంలో కూడా మొదట్లో ప్రభుత్వం రద్దు లేదా వాయిదా కుదరదని చెప్పేసింది. అయితే విద్యార్ధుల తల్లి, దండ్రులు కోర్టును ఆశ్రయించిన కారణంగా చివరకు వాయిదా వేసినట్లు ప్రకటించింది. ఎంతసేపు మంచి కాలేజీల్లో సీట్లు పొందాలని, విద్యార్ధుల భవిష్యత్తు కోసమే పరీక్షలను నిర్వహిస్తున్నట్లు బిల్డప్ ఇస్తోంది ప్రభుత్వం. అసలంటు విద్యార్ధులు ప్రాణాలతో ఉంటేనే కదా మార్కులైనా కాలేజీలో సీటైనా.
ఏదో మూలనుండి ఇంట్లో కూర్చున్న వాళ్ళకు కూడా కరోనా వైరస్ సోకేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వ్యాప్తిని ప్రభుత్వమే అరికట్టలేకపోతోంది. ఇలాంటి నేపధ్యంలో 5 లక్షల మంది విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించటం అంటే మామూలు విషయంకాదు. పరీక్షల సెంటర్లలోకి వెళ్ళేటపుడైనా తిరిగి వచ్చేటప్పుడైనా విద్యార్ధులంతా గుంపులు గుంపులుగానే ఉంటారు. ఈ గుంపులో ఏ ఒకరిద్దరికి కరోనా ఉన్నా మిగిలిన వాళ్ళకు రావటం ఖాయం.
ఇంతటి ప్రమాదకరమైన వైరస్ పిల్లలకు సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్న విషయం ప్రభుత్వానికి తెలియందికాదు. అయినా ఎందుకనో పరీక్షల నిర్వహణలో మొండిపట్టుదలకే పోతోంది. కరోనా వైరస్ నియంత్రణ కారణంగానే బుధవారం నుండి రాష్ట్రం మొత్తం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. వైరస్ తీవ్రత పెరిగిపోతోంది కాబట్టే కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలను కూడా రద్దు లేదా వాయిదా వేస్తేనే అందరికీ మంచిదని గ్రహించాలి.