ఏపీ సీఎం జగన్ అనూహ్య నిర్ణయంతో 2014 నాటి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని షెడ్యూళ్లు 9, 10 ప్రస్తుతం చర్చకు వచ్చాయి. ఈ షెడ్యూళ్లలోని అంశాలను అమలు చేయాలని కోరుతూ.. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనికి ప్రస్తుతం సమయం నిర్ణయించకపోయినా.. ఎన్నికల ముందు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ షెడ్యూళ్లు.. ప్రధాన ప్రచార అస్త్రాలుగా.. వివాదాస్పద అంశాలుగా మారుతున్నాయి. ఈ క్రమంలో అసలు అవేంటి..? ఇప్పటి వరకు.. ఏం జరిగింది? అనే విషయాలు తెలుసుకుందాం.
విభజన చట్టంలో మొత్తం 13 షెడ్యూళ్లు ఉన్నాయి. అయితే.. వీటిలో తీవ్ర వివాదాలకు దారితీసిన, విమర్శలకు తావిచ్చిన షెడ్యూళ్లు 9, 10. దీనికి కారణం.. ఈ రెండు షెడ్యూళ్లలోనూ ఆస్తులు, సంస్థలు ఉండడమే.9వ షెడ్యూల్లో 89 సంస్థలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ఆర్టీసీ భవన్ వంటివి ఉన్నాయి. అదేవిధంగా కొన్ని పరిశ్రమలు, సంస్థలు ఉన్నాయి.
అయితే.. వీటిని జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని.. విబజనచట్టం చెబుతోంది. కానీ, దీనికితెలంగాణ ప్రభుత్వం ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని.. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతోనూ సమావేశాలు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో పదో షెడ్యూల్లోని 107 సంస్థలను జనాభా ప్రాతిపదికన పంచాలని.. ఏపీ డిమాండ్ చేస్తోంది.
అయితే.. తెలంగాణ మాత్రం ఎక్కడివక్కడే ఉండాలని.. వాదిస్తోంది. అంతేకాదు.. సంపూర్ణ సహకారంతో ఆయా సంస్థల సేవలను ఇరు ప్రభుత్వాలు వినియోగించుకునేందుకు సహకరిస్తామని కూడా చెబుతోంది. అయితే.. ఈ వాదనను ఏపీ తిరస్కరిస్తోంది. 10వ షెడ్యూల్ కింద ఉన్నసంస్థలు ఇరు రాష్ట్రాల ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో ఏర్పడినవని.. కాబట్టి.. ఈ విషయంలో వివపక్ష చూపడానికి వీల్లేదని చెబుతోంది.
మరోవైపు ఆయా సంస్థలకు చెందిన సిబ్బంది విభజన కూడా ఇరు రాష్ట్రాల మధ్య వివాదానికి దారితీసిం ది. ఈ క్రమంలోనే 9వ షెడ్యూల్లోని ఆస్తుల విభజనపై `షీలా బిడే` నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. అయితే.. ఇప్పటి వరకు ఈ విషయం ఒక కొలిక్కి రాలేదు. అదేసమయంలో ఆయా సంస్థల హెడ్ క్వార్టర్స్ ఆస్తుల పంపిణీపైనా తెలంగాణ ఒప్పుకోవడంలేదు. ఇదిలావుంటే.. ఈ రెండు షెడ్యూళ్లలోనూ లేని మరికొన్ని సంస్థలపై కూడా ఇరు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతుండడంగమనార్హం.