పట్టుదల.. అంతకు మించిన మొండితనం.. ఒకసారి ఫిక్స్ అయితే ఎంతకైనా సరే అన్నట్లుగా ఉండే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు ఇప్పుడు షాకింగ్ గా మారింది.
కొన్ని విషయాల్లో ఆయన తీసుకునే నిర్ణయాలు పెద్ద ఎత్తున చర్చకు తెర తీస్తుంటాయి. కొద్దిరోజులుగా ఏపీలోని పదో తరగతి విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పటం తెలిసిందే.
ఇప్పుడున్న పరిస్థితుల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణ ఏ మాత్రం సరికాదని.. పిల్లల ఆరోగ్యం మీదనే కాదు.. వారి తల్లిదండ్రులు.. టీచర్లు.. ఇతర సిబ్బంది పైనా ప్రభావం చూపే ప్రమాదం ఉందున్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఏపీలో పదో తరగతి పరీక్షను రద్దు చేయాల్సిందిగా టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ డిమాండ్ చేయటం తెలిసిందే. మిగిలిన సందర్భాల్లో అయితే ఎలా ఉండేదో కానీ.. పరీక్షలు వద్దన్న లోకేశ్ మాటను ఫాలో కావటం ఏమిటని అనుకున్నరో ఏమో కానీ.. పరీక్షల్ని నిర్వహించే విషయంలో మహా పట్టుదలగా ఉన్నారు జగన్.
తాజాగా పరీక్షల నిర్వహణపై ఆయన పిడి వాదనను వినిపించారు. పరీక్షల్ని నిర్వహించాలన్న నిర్ణయం వెనుక పిల్లల భవిష్యత్తు కోసమే తానీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు.
రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తును తన కన్నా ఎక్కువగా ఆలోచించేవారు ఎవరూ ఉండరన్న మాట చెప్పిన ఆయన.. పరీక్షలు రాయకుంటే.. పాస్ సర్టిఫికేట్ లో పాస్ అని మాత్రమే ఉంటుందని.. అదే జరిగితే మంచి కాలేజీలో సీటు రాదని ఆయన చెబుతున్నారు.
ఈ కారణంతోనే తాము పరీక్షల్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఒకవేళ.. జగన్ వాదనే సరైనదని అనుకుందాం. కేంద్రం నిర్వహించే సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల్ని వాయిదా వేయలేదా? ఆ కారణంగా లక్షలాది మంది విద్యార్థులు ప్రభావానికి గురైనట్లే కదా?
ఆ మాటకు వస్తే.. గత ఏడాది పరీక్షల్ని నిర్వహించలేదు కదా? అప్పుడు పాస్ అయిన పిల్లల ప్రయోజనాలు దెబ్బ తిన్నట్లే కదా? అలాంటప్పుడు గత ఏడాది కూడా ఇంతే పట్టుదలతో పరీక్షలు నిర్వహించాలి కదా? వారికి జరిగిన నష్టం మాటేమిటి? లాంటి ప్రశ్నలు తలెత్తక మానవు.
జగన్ మాటల్ని కాసేపు పక్కన పెడితే.. 2020 – 2022 మధ్య కాలంలో జరిగే పరీక్షలకు సంబంధించి రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోవటం ఖాయం.
కరోనా వేళలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నది.. విద్యా వ్యవస్థ ఎంతలా ప్రభావితమైనది ప్రపంచంలో ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రానున్న రోజుల్లో కరోనా వేళలో పాస్ అవుట్ అయిన వారి విషయంలో అన్ని విద్యాసంస్థలు ఏదో ఒక సానుకూల నిర్ణయాన్నో.. ప్రత్యేక నిర్ణయాన్నో తీసుకోవటం ఖాయం.
ఎందుకంటే.. ఈ సమస్య ఏ ఒక్క రాష్ట్రానికో.. దేశానికో కాదు.. యావత్ ప్రపంచం మొత్తం ఉంది. జగన్ వాదన ప్రకారం.. పరీక్షలు వాయిదా వేసిన చోట ఉన్న విద్యార్థులందరికి నష్టం వాటిల్లినట్లే కదా? అలా జరగటాన్ని ఎవరు మాత్రం అంగీకరిస్తారు? తనకు తోచిన వాదనను వినిపించి కన్వీన్స్ చేయటం బాగున్నా.. తాను అనుకున్నది చేయటం కోసం పెద్ద రిస్కు తీసుకోవటం ఏ మాత్రం సరికాదన్నది జగన్ గుర్తిస్తే మంచిది.