`పార్టీ పరిస్థితి బాలేదు. మీరు ఇచ్చిన ఎంపీ సీటు నాకు వద్దులే` అంటూ… వరంగల్ ఎంపీ సీటును దక్కించుకున్న కడియం కావ్య బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్కు భారీ షాకిచ్చారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య తాజాగా పోటీ నుంచి తప్పుకొన్నారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖ రాశా రు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, గత ఏడాది జరి గిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం కావ్యను వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ ఇటీవల ప్రకటించారు.
ఇదీ లేఖ ..
‘ఇటీవల మీడియాలో బీఆర్ ఎస్పై వస్తున్న కథనాలు, అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కా మ్ ఆరోపణలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. అంతే కాకుండా, వరంగల్ జిల్లాలో పార్టీ నాయకుల మధ్య సమన్వయం లోపించింది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఒకరికొకరి మధ్య సహకారం కొరవడింది. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. అధినేత కేసీఆర్, పార్టీ కార్యకర్తలు నన్ను మన్నించాలి` అని కావ్య పేర్కొన్నారు.
ఈ లేఖ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే వరుస షాక్ లు తగులుతున్న నేపథ్యంలో ఇక, ఇప్పుడు కావ్య వంతు కూడా వచ్చిందా? అనే ఆసక్తికర చర్చ సాగుతుండడం గమనార్హం. కావ్య.. కడియం శ్రీహరి కుమార్తె. గత ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంనుంచి పోటీ చేశారు. ఇక, ఇప్పుడు అంతా కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో కావ్య కూడా కాంగ్రెస్ బాటే పట్టడం ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కావ్య అనూహ్యంగా పార్టీ పరిస్థితి బాగోలేదని చెప్పడం గమనార్హం.
పార్టీని బాగుచేసుకునే బాధ్యత ఎవరిది?
కావ్య చెప్పినట్టు.. పార్టీ పరిస్థితి బాగోలేదు.. కాబట్టి కాడి పడేస్తామంటే. పార్టీని బాగుచేసుకునే బాధ్యత ఎవరిది? స్వార్థ రహితంగా పార్టీకి సేవ చేయాల్సిన నాయకులు.. కనీసంలో కనీసం.. పార్టీ టికెట్ ఇచ్చారన్న కృతజ్ఞత కూడా చూపకుండా.. ఇలా పార్టీ మారిపోయే క్రమంలో నీడ నిచ్చిన పార్టీపైనే ఇలా నిందలేస్తే.. ఎలా? అనేది పరిశీలకుల మాట. ఏదేమైనా.. కష్ట కాలంలో పార్టీకి అండగా ఉన్న నాయకులను చూశాం. కానీ, కష్టాల్లోకి తోసేసేనాయకులను.. కష్టకాలంలో పార్టీని వదిలేసే నాయకులను ఇప్పుడే చూడాల్సి వస్తోంది.