విజయనగరం జిల్లా రామతీర్థంలోని కోదండ రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన వ్యవహారంపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్, రామతీర్థం కోదండ రామాలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజుకు సమాచారం లేకుండా, ప్రొటోకాల్ ప్రకారం ఆయనను ఆహ్వానించకుండా వైసీపీ సర్కార్ కక్ష తీర్చుకుందని ఆరోపణలు వచ్చాయి. శంకుస్థాపన విషయంలో అశోక్ గజపతిరాజుకు, మంత్రి వెల్లంపల్లికి మధ్య వాగ్వాదం జరగడం ఉద్రిక్తతకు దారి తీసింది. తనను వెల్లంపల్లి కొబ్బరికాయ కొట్టకుండా అడ్డుకున్నారని అశోక్ గజపతి ఆరోపించారు.
ఈ క్రమంలోనే అశోక్ గజపతిరాజుపై పోలీస్ కేసు నమోదు కావడం సంచలనం రేపింది. అశోక్ గజపతి రాజుపై 473,353 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలో ఇచ్చిన తీర్పును సంచయిత డివిజన్ బెంచ్‌లో సవాల్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా అశోక్ గజపతిరాజుకు హైకోర్టులో ఊరట లభించించింది. అశోక్ గజపతిపై పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో తదుపరి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది.
తనకు 353 యాక్ట్ వర్తించదని, ఆ యాక్ట్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలను ఫిర్యాదిదారుడు అందించలేదని హైకోర్టులో అశోక్ గజపతి తరఫు న్యాయవాది వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ఈ కేసులో తదుపరి చర్యలు చేపట్టవద్దని స్టే ఇచ్చింది. ఈ ఘటనపై నివేదిక అందించాలని పోలీసులను ఆదేశించింది. నివేదికను పరిశీలించిన తర్వాత తదుపరి ఆదేశాలిస్తామని హైకోర్టు తెలిపింది. ఇప్పటికే అశోక్ గజపతిరాజుకు ఈ కేసులో పోలీసులు సీఆర్పీసీ 41 ప్రకారం నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.